రామ్‌కి ప‌ట్టుకున్న భ‌యం

Ram fears about the fate of his next film
Thursday, August 30, 2018 - 22:45

టైమ్ క‌లిసిరాన‌పుడు ఎన్ని సెంటిమెంట్‌లు అయినా వ‌ర్క‌వుట్ కావు అనేది చాలా మంది మాట‌. రామ్ ప‌రిస్థితి ఇపుడు అలాగే ఉంది. "ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ" సినిమా ఫ్లాప్ కావ‌డంతో అర్జెంట్‌గా హిట్ కావాల‌నే ఉద్దేశంతో దిల్‌రాజు సినిమాని ఒప్పుకున్నాడు రామ్‌. అంత‌కుముందు దిల్‌రాజు బ్యాన‌ర్‌లో "రాజా ది గ్రేట్" సినిమాని చేసేందుకు ఒప్పుకోలేదు. పారితోషికం విష‌యంలో వ‌చ్చిన పేచీ కార‌ణంగా ఆ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. అది హిట్ కావ‌డంతో ఈ సారి రామ్ త‌గ్గాడు. రామ్ దిల్‌రాజు సినిమా ఒప్పుకున్న టైమ్‌లో నిర్మాత‌గా ఆయ‌న సూప‌ర్ స్థితిలో ఉన్నాడు. వ‌రుస‌గా ఆరు హిట్స్ ఇచ్చి ఒక ప్రౌడ్ పొజిష‌న్‌లో ఉన్నాడు దిల్ రాజు.

ఇపుడు సీన్ మారింది. వ‌రుస‌గా రెండు ఫ్లాప్‌లు త‌గిలాయి దిల్‌రాజుకి. ముఖ్యంగా "శ్రీనివాస కళ్యాణం" దారుణంగా ప‌రాజ‌యం కావ‌డం ఆయ‌న ప‌రువును తీసింది. ఇపుడు దిల్‌రాజు కాంపౌండ్‌లో అంద‌రూ అయోమ‌యంలో ఉన్నార‌ట‌. నెక్స్ట్ సినిమా ఎలాగైనా హిట్ చేయాల‌నే టెన్స‌న్‌లో ఉన్నారు. 

ఈ కాంపౌండ్ నుంచి వ‌స్తున్న నెక్స్ట్ మూవీ.. రామ్ హీరోగా రూపొందుతోన్న "హ‌లో గురు ప్రేమ‌కోస‌మే" సినిమానే. అందుకే రామ్‌కి ఇపుడు ఏమ‌వుతుందో ఏమో అనే భ‌యం ప‌ట్టుకుంద‌ట‌. ఈ సినిమాకి ప్యార‌ల‌ల్‌గా ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు సినిమాని మొద‌లుపెట్టాడు రామ్‌. ఐతే బ‌డ్జెట్ ఎక్కువ‌వుతోంద‌నే కార‌ణంతో..కొబ్బ‌రికాయ కొట్టిన త‌ర్వాత రామ్ ఆ మూవీని డ్రాప్ చేశాడు. ఇపుడు హిట్ కోసం ప్రార్థ‌న‌లు చేసే ప‌నిలో ఉన్నాడు.