రేవంత్ బాహుబ‌లి: రాంగోపాల్ వ‌ర్మ‌

Ram Gopal Varma believes Revanth Reddy is Baahubali for Congress party
Monday, October 30, 2017 - 16:45

సినిమాల‌కి సంబంధించిన విష‌యాలే కాదు తెలుగునాట కీల‌క‌మైన ప్ర‌తి రాజ‌కీయ ప‌రిణామంపై త‌న‌దైన శైలిలో పోస్ట్‌లు పెట్ట‌డం రాంగోపాల్ వ‌ర్మ శైలి. తాజాగా ఆయ‌న తెలంగాణ మాజీ టీడీపీ నాయ‌కుడు రేవంత్ రెడ్డిని బాహుబ‌లి అని డిక్లేర్ చేశాడు. తెలంగాణ‌లో కాంగ్రెస్‌ని అధికారంలోకి తెచ్చేందుకు ఎన్నిక‌ల నాటికి బాహుబ‌లి వ‌స్తాడ‌ని ఆ మ‌ధ్య కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఆ బాహుబ‌లి రేవంత్ రెడ్డి అని వర్మ ఫిక్స్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది.

జానారెడ్డి తాను అనుకున్న బాహుబ‌లి ఇత‌నేనా అన్న‌ది మ‌న‌కి తెలియ‌దు కానీ రేవంత్ కాంగ్రెస్‌ని కాపాడే బాహుబ‌లి అని అంటూ ఫేస్‌బుక్‌లో వ‌ర్మ తాజాగా ఒక పోస్ట్ పెట్టాడు.

"రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరడం నాకు చాలా చాలా హ్యాపీ. రేవంత్ రెడ్డి చేరటం మూలాన నాకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్లీ నమ్మకం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి బాహుబలి. బాహుబలి బాక్సాఫీస్ కి నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి ఓట్ల వర్షం కురిపిస్తాడు," అని ధీమాగా చెప్పాడు.

వ‌ర్మ జ‌న‌ర‌ల్‌గా వ్యంగ్యంగా పోస్ట్‌లు పెడుతుంటాడు. ఇది సెటైరా? నిజంగా ఆయ‌న అభిప్రాయమా? అన్న‌ట్లు వ‌ర్మ‌, రేవంత్‌రెడ్డి మ‌ధ్య చాలా కాలంగా మంచి స్నేహం ఉంది. మొన్న‌టి వ‌ర‌కు తెలుగుదేశం పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి రీసెంట్‌గా ఆ పార్టీకి రాజీనామా సమ‌ర్పించారు. ఇక నుంచి ఆయ‌న‌ది కాంగ్రెస్ జెండా.