అసలు సంగతి చెప్పడేంటి?

Ram hides this matter
Monday, October 28, 2019 - 18:30

ఇస్మార్ట్ శంకర్ వచ్చి మొన్నటికి వంద రోజులైంది.
రామ్ కు తన కొత్త సినిమా ప్రకటించే మూడ్ వచ్చింది

బహుశా ఈ రెండు వాక్యాలకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ.. అనుకోకుండా అలా సింక్ అయ్యాయి. అవును.. ఈరోజు రామ్ తన కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు. సినిమా పేరు రెడ్. ఎలాంటి క్యాప్షన్ లేదు. కిషోర్ తిరుమల దర్శకుడు. మణిశర్మ సంగీత దర్శకుడు. నవంబర్ 16 నుంచి షూటింగ్.

ఇలా ఒకేసారి సినిమా సంగతులన్నీ టపీటపీమంటూ బయటపెట్టాడు రామ్. పనిలోపనిగా సినిమాలో తన గెటప్ తో ఫస్ట్ లుక్ కూడా ఒకేసారి రిలీజ్ చేసేశాడు. ఇలా అన్ని విషయాల్ని ఒకేసారి బయటపెట్టిన రామ్, చాలా కన్వీనియంట్ గా ఓ విషయాన్ని మాత్రం సైడ్ చేసేశాడు. అదే రీమేక్ ఎలిమెంట్.

అవును.. ఘనంగా ప్రకటించిన రెడ్ అనే ప్రాజెక్టు నిజానికి ఓ రీమేక్ సినిమా. తమిళనాట సూపర్ హిట్ అయిన తడమ్ సినిమాకు రీమేక్ ఇది. కానీ ఈ విషయాన్ని మాత్రం రామ్ ఎనౌన్స్ చేయలేదు. రామ్ ఒక్కడే కాదు, ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో ఎవ్వరూ తాము చేస్తున్నది రీమేక్ అని చెప్పడం లేదు. ఇప్పుడా లిస్ట్ లోకి రామ్ చేరాడు. అంతే తేడా.