నితిన్ కు పాఠాలు చెబుతున్న రష్మిక

Rashmika as teacher to Nithin
Monday, July 22, 2019 - 14:30

ప్రస్తుతం "డియర్ కామ్రేడ్" సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంది రష్మిక. ఇలా ప్రచారం సాగిస్తూనే, మరోవైపు నితిన్ కు ప్రైవేటు క్లాసులు తీసుకుంటోంది. నిజమే.. ప్రస్తుతం నితిన్ కు ట్యూషన్ చెప్పే పనిలో బిజీగా ఉంది ఈ కన్నడ కస్తూరి. అయితే ఇది కూడా సినిమాలో భాగమే.

ప్రస్తుతం నితిన్-రష్మిక కలిసి భీష్మ అనే సినిమా చేస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ కు పాఠాలు చెప్పే టీజర్ గా రష్మిక కనిపించబోతోంది. అయితే అది కొద్దిసేపు మాత్రమే. సినిమాలో ఆ ఎపిసోడ్ ఎందుకుంది, అసలు రష్మిక క్యారెక్టర్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నితిన్ మాత్రం అమ్మాయిలకు దూరంగా ఉండే టైపు పాత్ర పోషిస్తున్నట్టు టాక్.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాపై నితిన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. "లై", "ఛల్ మోహన్ రంగ", "శ్రీనివాసకల్యాణం".. ఇలా వరుసగా 3 ఫ్లాపులు రావడంతో భారీ గ్యాప్ తీసుకున్నాడు. దాదాపు ఏడాది తర్వాత భీష్మ సినిమాతో సెట్స్ పైకి వచ్చాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నాడు