బిగ్ బాస్ హౌజ్ లో మంచోడికి స్థానం లేదు

Ravi Krishna to be eliminated
Saturday, September 28, 2019 - 17:15

అతడు అందరి దృష్టిలో మంచోడు. కొందరి దృష్టిలో అతి మంచోడు. అలాంటి వాడికి బిగ్ బాస్ హౌజ్ లో స్థానం లేదు. అసలు ఇన్నాళ్లు అతడి హౌజ్ లో కొనసాగడమే వింత. అతడే రవికృష్ణ. అవును.. ఈవారం రవికృష్ణ ఔట్ కాబోతున్నాడు. ఎలిమినేషన్ రౌండ్ కు నామినేట్ అయిన నలుగురిలో రవికృష్ణపైనే వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ వారం శ్రీముఖి, బాబా బాస్కర్, రవికృష్ణ, వరుణ్ సందేశ్ ఎలిమినేషన్ రౌండ్ లోకి వచ్చారు. వీళ్లలో రవికృష్ణ తప్ప మిగతా ముగ్గురూ స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఓట్లు కూడా మిగతా ముగ్గురికి కాస్త ఎక్కువగానే పోల్ అయినట్టు తెలుస్తోంది. సో.. ఈ వారం రవికృష్ణ ఎలిమినేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇది ఈ రాత్రికి లేక రేపా అనేది తేలాల్సి ఉందంతే.

ఈవీకెండ్ బిగ్ బాస్ హాట్ హాట్ గా సాగబోతోంది. సరదా ఆటలు, టాస్క్ ల కంటే సీరియస్ డిస్కషన్లే ఎక్కువగా జరగబోతున్నాయనే విషయాన్ని స్టార్ మా యాజమాన్యం ప్రోమో రూపంలో బయటపెట్టింది. ఎప్పుడూ లేని విధంగా నాగార్జున ఫైర్ అయ్యే వీడియోను ప్రోమోలో చూపించింది యాజమాన్యం.

మరోవైపు ఎలిమినేషన్ కు సంబంధించి రవికృష్ణ పేరు బయటకు రావడం మాత్రం బాధాకరం. ఎందుకంటే అతడు ఇప్పటివరకు కెప్టెన్సీ వరకు కూడా రాలేదు. కెప్టెన్ కూడా అవ్వకుండానే ఎలిమినేట్ అవ్వడం కాస్త ఇబ్బందికర అంశమే. అయితే అలీ రెజా టైపులో ఇది కూడా డ్రామా అనే బ్యాచ్ కూడా తయారైంది. ఎలిమినేట్ చేసి మళ్లీ హౌజ్ లోకి ప్రవేశపెడతారని కొందరు వాదిస్తున్నారు.