ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్‌కి చిక్కులు!

RGV's Lakshmi's NTR to face release issues
Sunday, February 24, 2019 - 09:45

రాంగోపాల్ వ‌ర్మ తీసిన "ల‌క్ష్మీస్ ఎన్టీఆర్" విడుద‌ల‌కి రెడీ అవుతోంది. ఐతే ఈ సినిమా విడుద‌లకి కొన్ని ఇక్క‌ట్లు త‌ప్ప‌వ‌ని ఇన్‌సైడ్ టాక్‌.

ఎటువంటి క‌ట్స్ లేకుండా ఇది సెన్సార్ కావ‌డం అంత ఈజీ కాదు. "యాత్ర" కానీ, "ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు" కానీ...డైర‌క్ట్‌గా ఏ పార్టీపైన కానీ, ఏ నాయ‌కుడిపైన కానీ అభ్యంత‌ర‌క‌ర ప‌దాలు, మాట‌లు వాడ‌లేదు. కాంగ్రెస్ అధిష్టాన్ని (యాత్ర‌లో), నాదెండ్ల‌ని (మ‌హానాయ‌కుడులో) నెగిటివ్‌గా చూపించారు కానీ బియాండ్ బోర్డ‌ర్ దాట‌లేదు. "ల‌క్ష్మీస్ ఎన్టీఆర్" అలా కాదు. ఈ సినిమాలోప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు విల‌న్‌. నా జీవితంలో చేసిన ఏకైక త‌ప్పు వాడిని న‌మ్మ‌డ‌మే అని ఎన్టీఆర్ బాబుని ఉద్దేశించి చెప్పే డైలాగ్‌లు (ఇది ట్ర‌యిల‌ర్‌లో చూశాం) చాలా ఉన్నాయ‌ట‌. వాటిని సెన్సార్ బోర్డు అనుమ‌తిస్తుందా? క‌ట్ చెపుతుందా?

మ‌రోవైపు, ఈ సినిమాకి మంచి క్రేజ్ పెరిగింది. ఇది వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌కి ద‌గ్గ‌రిగా ఉంటుంద‌నిపిస్తోంది. అందుకే ట్ర‌యిల‌ర్ అంత హిట్ట‌యింది. ఎటువంటి పెయిడ్ గిమ్మిక్కులు లేకుండానే ఆ ట్ర‌యిల‌ర్ 10 మిలియ‌న్ల వ్యూస్ సాధించింది. అంటే ఏ రేంజ్‌లో వ‌ర్మ సినిమా ట్ర‌యిల‌ర్ సంచ‌ల‌నం సృష్టించిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఐతే వ‌ర్మ ట్ర‌యిల‌ర్‌లో ఉన్న మేట‌ర్ సినిమాలో అంత‌గా ఉండ‌ద‌నే న‌మ్మ‌కం చాలా మందిలో ఉంది. ఆ న‌మ్మ‌కాన్ని ఈ సినిమా బ‌ద్ద‌లు కొడుతుందా అనేది చూడాలి.

వ‌ర్మ తీసే సినిమాలు చూసేందుకు జ‌నం బ‌య‌టికి రావ‌డం లేదు. ఆఫీస‌ర్ సినిమాని రెండో రోజుకే థియేట‌ర్ల నుంచి తొల‌గించారు. ఇలాంటి నేప‌థ్యంలో ఆయ‌న సినిమాలనుఎవ‌రూ కొనడం లేదు. ఐతే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి మాత్రం బిజినెస్ ప‌రంగా మంచి డిమాండ్ ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. శివం సెల్యులాయిడ్ అనే సంస్థ ఈ సినిమా హక్కులను దాదాపు 10 కోట్ల రూపాయ‌ల మొత్తానికి తీసుకున్నార‌నే మాట వినిపిస్తోంది. అంతా కొత్త‌వాళ్ల‌తో త‌క్కువ బ‌డ్జెట్‌లో (రెండున్న‌ర కోట్లు ఖ‌ర్చు అయిన‌ట్లు టాక్‌) తీసిన ఈ సినిమాతో వ‌ర్మ రిలీజ్‌కి ముందే లాభాల‌ను చూడ‌నున్నారు. 

ఈ సినిమాని మార్చి 15న రిలీజ్ చేయాల‌నేది ప్లాన్‌. ఆ టైమ్‌కి ఎన్నిక‌ల కోడ్ కూడా వ‌స్తుంది. మ‌రి ఎన్నిక‌ల టైమ్‌లోరిలీజ్‌కి ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ ప‌ర్మిష‌న్ కావాల్సి ఉంటుంది. సో..సెన్సార్ ప‌రంగానూ, ఎన్నిక‌ల సంఘంతోనూ వ‌ర్మ చిక్కులు ఎదురుకోక త‌ప్ప‌దు.