సాహో మ‌రో స్పైడ‌ర్‌గా మారుతోందా?

Saaho's Psycho Saiyaan getting trolled
Monday, July 8, 2019 - 19:45

"సాహో" సినిమా విడుద‌ల‌కి కౌంట్‌డౌన్ షురూ అయింది. ఈ సినిమా తొలి పాట పూర్తిగా విడుద‌లైంది ఈ రోజు. సైకో స‌య్యా అనే ఈ పాట మొత్తం విన్నాక‌.. జ‌నం ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ప్ర‌భాస్‌ ఫ్యాన్స్ కూడా బాగా ఫీల‌వుతున్నారు..ఏందీ ఈ పాట అని. 

ఆ మ‌ధ్య "స్పైడ‌ర్" సినిమాకి సంబంధించిన‌ పుచ్చ‌కాయ పుచ్చ‌కాయ పాట విడుద‌లైన టైమ్‌లో జ‌నం మ‌హేష్‌బాబుని ఎలా ట్రోల్ చేశారో ఇపుడు ప్ర‌భాస్‌ని ఈ పాట విష‌యంలో అలాగే చేస్తున్నారు. హిందీ పాట రిలీజ్ చేశారు స‌రే మ‌రి ఇంకేంటి..తెలుగు పాట ఎపుడు అంటూ ఆట‌ప‌ట్టిస్తున్నారు. ఈ పాట‌ని హిందీ నుంచి తెలుగులోకి డ‌బ్ చేసిన‌ట్లు ఉంది. తెలుగు ప‌దాల‌ను అర్థం చేసుకోవ‌డం చాలా క‌ష్టంగా ఉంది. అందుకే ఇంత ట్రోలింగ్‌.

నాగార్జున త‌మిళం మార్కెట్ కోసం "ర‌క్షకుడు" చిత్రం చేసి భంగ‌ప‌డిన‌ట్లు, మ‌హేష్‌బాబు మురుగ‌దాస్ డైర‌క్ష‌న్ అని మురిసిపోయి "స్పైడ‌ర్" చేసి చేతులు కాల్చుకున్న‌ట్లు... ప్ర‌భాస్ కూడా ప్యాన్ ఇండియా మార్కెట్ పేరుతో అలా అయిపోతాడా ఆయ‌న ఫ్యాన్స్‌లోనూ వ‌ర్రీ మొద‌లైంది. అయితే ఈ రెండు సినిమాల‌కి ఇత‌ర భాష‌లకి చెందిన ద‌ర్శ‌కులు తీశారు. "సాహో" సినిమాకి తెలుగు ద‌ర్శ‌కుడే. సుజీత్‌.. ఈ సినిమాని గ్రాండ్‌గా తీశారు.

ఐతే టెక్నీషియ‌న్లు అంతా హాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన వారు. వాళ్లే ఏదో గ‌డ‌బిడ చేశారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.