సమంతకి ఛాలెంజ్ విసిరిన సాయిపల్లవి

Sai Pallavi's green challenge to Samantha
Thursday, October 10, 2019 - 18:00

ప్రస్తుతం సాయిపల్లవికి చెందిన ఓ పిక్ బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసా? సాయిపల్లవి కొత్త సినిమా స్టిల్ కాదు. ఆమె ఫొటో షూట్ స్టిల్ కూడా కాదు. అలాఅని సోషల్ మీడియా కోసం దిగిన రియల్ లైఫ్ పోజు కూడా కాదు. ఆమె ఓ మొక్కను నాటుతోంది. ఆ ఫొటోనే ఈరోజు బాగా వైరల్ అవుతోంది. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా సాయిపల్లవి ఈ పని చేసింది.

తను ఓ మొక్కను నాటుతూ సాయిపల్లకి గ్రీన్ ఛాలెంజ్ విసిరాడు వరుణ్ తేజ్. దీన్ని స్వీకరించిన సాయిపల్లవి కూడా ఓ మొక్క నాటింది. అంతా మొక్కలు నాటాలంటూ పిలుపునిచ్చింది. వరుణ్ తేజ్ కు థ్యాంక్స్ చెబుతూనే, పనిలో పనిగా రానా, సమంతను నామినేట్ చేసింది ఈ ఫిదా భామ. ప్రస్తుతం ముంబయిలో కోలుకుంటున్న రానా ఇప్పటికిప్పుడు ఈ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించకపోవచ్చు. సమంత మాత్రం రేపోమాపో మొక్క నాటే స్టిల్ ను పోస్ట్ చేసే అవకాశం ఉంది.

సోషల్ మీడియాలో ఇప్పటికే ఎన్నో ఛాలెంజెస్ చూశాం. అలాంటిదే ఈ గ్రీన్ ఛాలెంజ్ కూడా. ఎక్కువ మొక్కలు నాటి ఈ భూమిని కాపాడుకుందాం అనేది ఈ గ్రీన్ ఛాలెంజ్. అంతర్జాతీయ స్థాయిలో మొదలైన ఈ ఛాలెంజ్, ఇప్పుడు ఇండియాకు కూడా వచ్చింది. ప్రధాని నరేంద్రమోడీ చొరవతో సెలబ్రిటీలు, తారలు ఒక్కొక్కరుగా ఇందులో భాగస్వాములవుతున్నారు. గతంలో స్వచ్ఛభారత్ ఉద్యమంలో ఎలాగైనా స్టార్స్ అంతా పాల్గొని దాన్ని సక్సెస్ చేశారో, ఈ గ్రీన్ ఛాలెంజ్ ను కూడా అలాగే సక్సెస్ చేయాలనేది కాన్సెప్ట్. మొక్కలు నాటడం వరకు ఓకే, దాని పరిరక్షణ సంగతేంటి? అప్పుడు కొత్తగా ఇంకో ఛాలెంజ్ మొదలవుతుందేమో.