మేం మ‌రీ ఎలా క‌నప‌డుతున్నాం: శ‌ంక‌ర్ మ‌హ‌దేవ‌న్‌

Shanakr Mahadevan opens up about Saaho
Tuesday, May 28, 2019 - 23:30

"సాహో" సినిమా నుంచి ఉన్న‌ట్లుండి ఎందుకు త‌ప్పుకోవాల్సి వ‌చ్చిందో సంగీత ద‌ర్శ‌కుడు, గాయ‌కుడు శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ పెద‌వి విప్పాడు. మా స్థాయి ఏంటి, ద‌ర్శ‌క నిర్మాత‌లు పెట్టిన‌ కండీష‌న్లు ఏంటి అని మండిప‌డుతున్నాడు శంకర్ మ‌హాదేవ‌న్‌.

అస‌లు విష‌యం ఏంటంటే.... ప్రభాస్‌ నటిస్తున్న ‘సాహో’ సినిమాకి శంకర్‌-ఎహసాన్‌-లాయ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే కొన్ని పాట‌లు ఇచ్చారు. ఇపుడు త‌ప్పుకున్నారు. ఎందుకంటే మిగ‌తా పాట‌ల‌ను ఒక్కో పాట‌ని ఒక్కో సంగీత ద‌ర్శ‌కుడితో కంపోజ్  చేయించాల‌ని ద‌ర్శ‌కుడు సుజీత్‌, నిర్మాత వంశీ-ప్ర‌మోద్ ప్లాన్ చేశారు. ఈ ప్ర‌పోజ‌ల్‌ని వారి ముందు పెట్టిన‌పుడు ఒరిజిన‌ల్ సంగీత ద‌ర్శ‌కులైన శంకర్‌-ఎహసాన్‌-లాయ్ ఒప్పుకోలేదు. అన్ని పాట‌లు చేస్తాం లేదంటే ఏ పాట‌కి క్రెడిట్ తీసుకోమ‌ని త‌ప్పుకున్నారు.

సాహో సినిమా హిందీ హ‌క్కుల‌ను టి సిరీస్ సంస్థ కొనుక్కొంది. టిసిరీస్ సంస్థ పాట‌ల‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. మార్కెట్‌లో ఇపుడు ఎవ‌రికి క్రేజ్ ఉందో వారితో ఒక్కో పాట చేయిస్తుంటుంది. అలా తాము కొన్న సినిమాల‌ను ప్ర‌మోట్ చేస్తుంటుంది. అది టిసిరీస్ మార్కెటింగ్ ప‌ద్ద‌తి. కానీ శంకర్‌-ఎహసాన్‌-లాయ్ పేరున్న సంగీత ద‌ర్శ‌కులు. "దిల్ చాహ‌తా హై", "క‌ల్ హో నా హో", "డాన్‌", "జింద‌గీ నా మిలేగీ దుబారా", "రాక్ ఆన్‌", "రాజీ", "మ‌ణిక‌ర్ణిక" వంటి సినిమాల‌కి మ్యూజిక్ ఇచ్చారు. త‌మ‌న్ ఒక పాట‌, జీబ్రాన్ ఒక పాట, మ‌రొక‌రు మ‌రో పాట కంపోజ్ చేస్తారు..... వాళ్లే రీరికార్డింగ్ చేస్తారంటే ఎలా ఊరుకుంటారు. అదే జ‌రిగింది. 

అందుకే త‌ప్పుకున్నామ‌ని శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ చెపుతున్నాడు. ఫ‌లానా సినిమాకి ఫ‌లానా సంగీత ద‌ర్శ‌కుడు మ్యూజిక్ ఇచ్చాడ‌నేది ఒక గౌర‌వం. కానీ ఒక్కో పాట ఒక‌రు కంపోజ్ చేశారంటే..ఆ సినిమా వ‌ల్ల మ్యూజిక్ డైర‌క్ట‌ర్ల‌కి వ‌చ్చే గౌర‌వం ఏముంటుంది. ఒక్కో సీన్‌ని ఒక్కో డైర‌క్ట‌ర్ తీయ‌రు క‌దా? ఇలా ఫీల‌యి వారు త‌ప్పుకున్నారు. అదీ సంగతి.

దాదాపు 300 కోట్ల రూపాయ‌ల‌తో తెర‌కెక్కుతోంది "సాహో". ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది ఈ మూవీ కానీ ఇంత‌వ‌ర‌కు గుమ్మ‌డికాయ కొట్ట‌లేదు. షూటింగ్ చాలా కాలంగా "తుది" ద‌శ‌లోనే సా....గుతోంది.