మీటూతో శ్రుతి ఆఫ‌ర్ల‌కి వేటు

Shruti Hariharan says she is not getting offers now
Saturday, December 22, 2018 - 09:15

>మీటూ ఉద్య‌మం సినిమా ఇండ‌స్ట్రీలో మంచి మార్పులను తీసుకొచ్చింది. లైంగిక వేధింపులు త‌గ్గాయి. అంద‌రిలోనూ ఎంతో కొంత మార్పు వ‌చ్చింది. ఐతే మీటూ వివాదంలో ఆరోప‌ణ‌లు చేసిన హీరోయిన్లు వార్త‌ల్లో నిలిచి సోష‌ల్ మీడియాలో పేరు సంపాదించుకున్నా..వారి కెరియ‌ర్‌కి మాత్రం శాపంగా మారిన‌ట్లు క‌నిపిస్తోంది. >క‌న్న‌డ న‌టి శ్రుతి హ‌రిహ‌రన్ సీన్ అదే.

ఆమె ఒకే ఒక్కడు అర్జున్‌పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేసింది. ఇపుడు ఆమెకి ఒక్క చాన్స్ కూడా రావ‌డం లేదట‌. ఒక‌పుడు ప్ర‌తి వారం ముగ్గురు, నలుగురు ఫిల్మ్ మేక‌ర్స్ ఆమె డేట్స్ కోసం అప్రోచ్ అయ్యేవార‌ట‌. క‌థ‌లు చెప్పేవార‌ట‌. ఇపుడు గ‌త నెల మొత్త‌మ్మీద ఒక్క నిర్మాత మాత్ర‌మే ఒక సినిమా ఆఫ‌ర్‌తో వ‌చ్చాడ‌ట‌. అంత‌గా అవ‌కాశాలు త‌గ్గాయి. మీటూ వివాదంలో నోరు విప్పిన హీరోయిన్ల‌పై సినిమా ఇండ‌స్ట్రీలో అప్ర‌క‌టిత నిషేధం ఉంద‌ని ఆమె తాజాగా ఆరోపిస్తోంది.

కురుక్షేత్రం అనే సినిమా షూటింగ్ టైమ్‌లో అర్జున్‌ శ్రుతి హ‌రిహ‌ర‌న్‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌నేది ఆరోప‌ణ‌. రొమాంటిక్ సీన్‌లో కావాల్సిన దానిక‌న్నా ఎక్క‌వ‌గా హ‌గ్ చేసుకోవ‌డం, నొక్క‌డం, డ‌బుల్ మీనింగ్ డైలాగ్‌లతో వేధించాడ‌ని ఆమె మొద‌ట ఆరోప‌ణ చేసింది. అదంతా అబ‌ద్ద‌మ‌ని ఆ సినిమా ద‌ర్శ‌కుడు చెప్ప‌డంతో.. శ్రుతి హ‌రిహ‌ర‌న్ మ‌రిన్ని ఆరోప‌ణ‌లు చేసింది. త‌న బెడ్‌రూమ్‌కి ర‌మ్మంటూ అర్జున్ మెసేజ్‌లు పెట్టాడ‌ని, ఆధారాలున్నాయ‌ని తెలిపింది. ఈ కేసు ఇపుడు కోర్టులో న‌డుస్తోంది.