గ్యాంగ్‌లీడ‌ర్‌కి చిచ్చు పెట్టిన ఏజెంట్‌

Similarities between Gang Leader and Agent Sai Srinivasa Athreya
Monday, June 24, 2019 - 15:30

నాని న‌టిస్తున్న "గ్యాంగ్‌లీడ‌ర్" సినిమా ఆగ‌స్ట్ 30 విడుద‌ల ల‌క్ష్యంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాకి హ‌లో, మ‌నం చిత్రాల ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె కుమార్ రూప‌క‌ర్త‌. షూటింగ్ మొద‌లుపెట్టిన‌పుడే క‌థ ఎలా ఉంటుందో చెప్పే విధంగా ఒక చిన్న టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు. ఆరేళ్ల పాప నుంచి 60 ఏళ్ల బామ్మ వ‌ర‌కు ఐదుగురు మ‌హిళ‌ల‌కి గ్యాంగ్‌లీడ‌ర్‌గా ఉండే ఒక నాయ‌కుడి క‌థ ఈ మూవీ. ఇదొక క్రైమ్ థ్రిల్ల‌ర్‌. 

మ‌ర్డ‌ర్స్ చుట్టూ తిర‌గే క‌థ‌. ఐతే తాజాగా విడుద‌లైన "ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ" సినిమాతో ఈ మూవీకి చిక్కు వ‌చ్చి ప‌డింద‌ట‌. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మంచి క‌లెక్ష‌న్ల‌ను సాధించింది మొద‌టి వీకెండ్‌. అలాగే ప్ర‌శంస‌లు మూట‌గ‌ట్టుకొంది. ఏజెంట్ శ్రీనివాస్ కూడా కొన్ని మ‌ర్డ‌ర్స్‌ని ఛేదించే క్ర‌మంలో పెద్ద స్కామ్‌ని బ‌య‌ట‌పెడుతాడు. ఈ సినిమాలోని కొన్ని సీన్లు, గ్యాంగ్‌లీడ‌ర్‌లోని కొన్ని సీన్లు ఒకే తీరుగా ఉన్నాయ‌ట‌.

ఇటీవ‌ల ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా చూసిన విక్ర‌మ్‌కుమార్ టీమ్ మెంబ‌ర్స్ ద‌ర్శ‌కుడికి, నానికి చెప్పార‌ట‌. దాంతో ఆ సీన్ల‌ను ఇపుడు మ‌ళ్లీ తిర‌గ‌రాయ‌ల్సిన అవ‌స‌రం ఉంది. రెండు సినిమాల క‌థ‌లు వేరు. కానీ కొన్ని స‌న్నివేశాలు మాత్రం సేమ్‌గా ఉన్నాయ‌ట‌. మ‌రి "గ్యాంగ్‌లీడ‌ర్" ఆగ‌స్ట్ 30న వ‌స్తుందా లేక వాయిదా ప‌డుతుందా అనేది చూడాలి.