టెంప‌ర్ రీమేక్ అక్క‌డా హిట్టే

Simmba, remake of Temper, doing good business.
Tuesday, January 1, 2019 - 23:00

పూరి రూపొందించిన టెంప‌ర్ సినిమా ఎన్టీఆర్‌ని స‌క్సెస్ రూట్లోకి తీసుకొచ్చింది. టెంప‌ర్‌కి ముందు అప‌జ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు జూనియ‌ర్‌. ఇది భారీ విజ‌యం సాధించిక‌పోయినా.. ఓ మోస్తారు విజ‌యంతో పాటు న‌టుడిగా మ‌రోసారి మంచి పేరుని తెచ్చిపెట్టింది. అలాగే సిక్స్‌ప్యాక్ బాడీకి బాట‌లు వేసింది. 

వ‌క్కంతం వంశీ రాసిన ఈ క‌థ ఇపుడు త‌మిళంలో విశాల్ హీరోగా రీమేక్ అవుతోంది. ఇక గ‌త‌వారం హిందీలో విడుద‌లైంది. సింబా పేరుతో ర‌ణవీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి తీసిన ఈ టెంప‌ర్ రీమేక్ వంద కోట్ల రూపాయ‌ల క్ల‌బ్బులో చేరింది. తొలి ఐదు రోజుల్లో ఇండియాలో వంద కోట్లు దాటేసింది. ఈ సినిమా లైఫ్‌టైమ్ ర‌న్‌లో 200 కోట్ల మార్క్‌ని అందుకుంటుంద‌నేది ట్రేడ్ పండితుల అంచ‌నా.

సింగం సినిమాల్లోని అజ‌య్ దేవ‌గ‌న్ పాత్ర‌కి, ఈ సినిమాకి లింక్ క‌లిపాడు రోహిత్ షెట్టి. సింగం సినిమాల్లోని ఓ బాలుడు అజ‌య్‌దేవ‌గ‌న్ పోలీసు పాత్రతో ఇన్‌స్ప‌యిర్ అయి అత‌ను పెద్ద‌యిన త‌ర్వాత పోలీసుగా మార‌డం, అత‌నే సింబాలోని హీరో అని చూపించాడు రోహిత్ షెట్టి. అది మాస్ జ‌నాల‌కి బాగా న‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. టెంప‌ర్ సినిమాలో సెకండాఫ్‌లోని సీన్లే కీల‌కం. ఈ సినిమాలోనూ అవే వ‌ర్క‌వుట్ అయ్యాయ‌ట‌. అందుకే అక్క‌డా హిట్ దిశ‌గా వెళ్తోంది. ఈ సినిమాలో ర‌ణ‌వీర్ సింగ్ స‌ర‌స‌న సైఫ్ కూతురు హీరోయిన్‌గా న‌టించింది.