తెర‌పై కురిసిన సిరావెన్నెల‌!

Sirivennela Seetharama Sastry: A profile
Sunday, January 27, 2019 - 13:45

ఆయన ఉచ్ఛ్వాసము కవనం..
ఆయన నిశ్వాసము గానం
కలం కదిలిస్తే క‌వితా ప్ర‌వాహం
పాట మ‌లిచారంటే అది ప్రబంధం
తెలుగు సినిమా సాహిత్యానికి లభించిన ఒక వరం సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆయన పాటలు వెండితెర‌ మీద కురిసిన చల్లని సిరివెన్నెల. వెన్నెల్లో బృందావనాన్ని చూపించిన సిరావెన్నెల.

సాహితీ సరస్వతిని స్వర్ణ‌కమలాలతో అర్చించిన సరస్వతీపుత్రులు సిరివెన్నెల. ఆధ్యాత్మిక గీతాలు, సందేశాత్మక గీతాలు, ఉత్తేజపూరిత గేయాలకే సిరివెన్నెల పాపులర్ అనుకుంటే పొరపాటు. ఆయన కలానికి లొంగని సన్నివేశం, సందర్భం లేనే లేదు. అది రొమాంటిక్ గీతమైనా కావొచ్చు, సరదాగా సాగే సాంగ్ అయినా కావొచ్చు. పాటకి సందర్భం ఏదైనా, ఏ పాటలోనైనా చక్కటి కవిత్వం పొంగిపొర్లుతుంది.

ఆయన పాటల్లో తెలుగు అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లల్లా అందంగా కవ్విస్తాయి. ఆయన పాటలో మాట ఒక మంత్రంలా ధ్వనిస్తుంది. శబ్దసౌందర్యం తెలిసిన సినిమా కవుల్లో సీతారామశాస్త్రి ఒకరు.

వెన్నెల సిరా నింపుకున్న ఆయన కలం నుంచి జాలువారిన అనేక పాటలు ఆణిముత్యాలుగా నిలిచాయి. శ్రీశ్రీలా భాషపై సాధికారికత, ఆత్రేయ కలంలోని భావసంపద, వేటూరిలోని వైవిధ్యం, సినిమా కవుల్లో మళ్లీ సీతారామశాస్త్రిలో మాత్రమే కనిపిస్తుంది. అందుకే, ఆయన పాట ఒక పంచామృతం అయింది. 

ఆయన సినీప్రస్థానంలో ఎన్నెన్నో సినిమాలు.. వేలల్లో పాటలు, మరెన్నో అవార్డులు. 11 నంది అవార్డులు అందుకున్న ఏకైక కవి ఆయనే. విశ్వనాథ్ చిత్రమైనా, వినాయక్ మూవీ అయినా ఆయన కలం అందంగానే స్పందిస్తుంది. పక్కా కమర్షియల్ సినిమాల్లోనూ ఆలోచన రేకెత్తించే సందర్భాన్నే ఆయన అందుకుంటారు. ఆయన పంథా, ఆయన రాసే విధానం అంతా విలక్షణం.

1955 మే 20న జన్మించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. సినిమా రంగంలోకి అడుగుపెట్టింది 1986లో. కె.విశ్వనాథ్ రూపొందించిన సిరివెన్నెలతో సీతారామశాస్త్రి సినీకవిగా మారారు. తొలి సినిమానే సూపర్ హిట్. ఊరూరా పాటలన్నీ మార్మోగాయి. అందులో ఆయన రాసిన ప్రతీ పాట ఒక చిక్కని కవిత్వానికి ప్రతీకగా నిలిచాయి. ఆ సినిమానే ఇంటిపేరుగా మారిపోయింది. తొలి చిత్రమే ఆయన సాహితీ గ్రంధానికి ముఖచిత్రమైంది. 

80లలో తెలుగు సినిమా పాట అసభ్య పదాల సందుల్లో కొట్టుమిట్టాడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో తన కలంతో తెలుగు పాటకి మళ్లీ ఉత్తమ సాహిత్యపు గుభాలింపుని అద్దారు సిరివెన్నెల. హీరో, హీరోయిన్ల డ్యూయెట్ అనగానే ద్వందార్థ పదాలను ఇరికించడం కాదనీ, యుగళ గీతాల్లోనూ మనసుకింపైన సాహిత్యాన్ని చొప్పించొచ్చని నిరూపించారు. 

పాటల్లో చక్కటి భావాలు మరుగునపడి, అంత్యప్రాసల  ఆటగా పాట మారుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో శృతిలయలు, స్వర్ణకమలం, రుద్రవీణ వంటి చిత్రాలతో కెరీయర్ తొలినాళ్లలోనే తన కలం బలం ఏ పాటిదో నిరూపించారు. పాటల తోటలో అందమైన పూలు పూయించారు. 

వేటూరి వంటి మహాకవి కాలంలోనే సిరివెన్నెల తక్కువ సమయంలోనే ఉత్తమ శ్రేణి పాటల రచయితగా నిలబడడం విశేషం. కె.విశ్వనాథ్ తో పాటు రాంగోపాల్ వర్మ వంటి దర్శకుల కారణంగానే సినిమా పాటకి మళ్లీ వైభవం వచ్చింది. వారి ఆలోచనలకి తగ్గ భావాలను అందించిన ఆ కలం... సిరివెన్నెల సీతారామశాస్త్రిది. కృష్ణవంశీ వంటి దర్శకులు, ఎం.ఎస్.రాజు, దిల్‌రాజు వంటి నిర్మాతల రాకతో సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం కొత్త శతాబ్దంలోనూ కొత్త పుంతలు తొక్కింది. కొత్త తరంలో పలువురు దర్శకులు సిరివెన్నెల నుంచి సింగిల్ కార్డ్ పాటలు తీసుకొని తమ సినిమాల విజయాలకి బాటలు వేసుకున్నారు. 

ఇప్పుడు ఆయన స్లో అయ్యారు. ఐనా మంచి పాట కావాలనుకునే వారందరికీ నేటికీ చిరునామా.. శ్రీనగర్ కాలనీలోని సామాన్య రెసిడెన్సీనే. 

సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటల్లో కేవలం పాండిత్య ప్రదర్శనే ఉండదు. అందరూ మాట్లాడుకునే చిన్ని చిన్ని పదాలతోనే సముద్రపు అంతటి భావాన్ని ఇముడ్చుతారు. ఆయన పాట అటు సినిమా సందర్భానికి ఎంత సరిగ్గా సూటవుతుందో, మన జీవితంలోని వేర్వేరు సందర్భాలకి కూడా అదే విధంగా సరిపోతుంది. తాత్వికత కూడా చాలా సింపుల్ గా ఉంటుంది.

సిరివెన్నెల రాసిన పాటల గురించి మాట్లాడుకున్నప్పుడు.. శృతిలయలు చిత్రంలోని తెలవారదేమో స్వామి అనే పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నంది అవార్డుల పోటీకి ఈ పాటని పంపిస్తే ఆ జ్యూరీ కమిటీ ఈ పాటకి అవార్డు ఇచ్చేందుకు నిరాకరించింది. ఎందుకంటే, ఈ పాటని త్యాగరాజు కీర్తనగా వారు భావించారు. కానీ అది సీతారామశాస్త్రి రాసిందే అన్న విషయం ఆలస్యంగా గ్రహించి, ఆయన కవితాశక్తికి సెల్యూట్ చేసి, నంది అవార్డును ప్రకటించారు.

అవసరమైనప్పుడు సిరివెన్నెల కలం అభ్యదయ భావాలను గర్జించింది. అలాగే ఉత్తేజకరమైన పాటలు రాయడంలోనూ సిరివెన్నెల పేరొందారు. ఆయన పాట మన ఆలోచనలకి నిప్పు రగిలిస్తుంది. చైతన్యదీప్తిని వెలిగిస్తుంది. 

ప్రేమభావాలను, ప్రేమికుల ఊసులను అందంగా చెప్పడంలో సిరివెన్నెల స్పెషలిస్ట్. ఆత్రేయ తర్వాత మూగ మనసుల భావాలను పాటల్లో ఒలికించడంలో సిరివెన్నెలనే ది బెస్ట్. అనేక ప్రేమకథా చిత్రాలకి ఆయన ాసిన పాటలు.. ప్రేమికుల లవ్ ఈమెయిల్స్ కి మ్యాటర్ గా మారాయి.

పాట రాసేందుకు ఆయన చాలా సమయం తీసుకుంటారని నిర్మాతలు బాధపడతారు. కానీ ఏదో ఒకటి గీకి ఇచ్చేయడం ఆయనకి చేతకాదు. మంచి పాట కోసం ఆయన అనునిత్యం మధనపడుతారు. ఓ సందర్భంలో దర్శకుడు త్రివిక్రమ్ అన్నట్టు.. అర్థరాత్రి సూరీడు ఆయన. ఈ సర్వతీపుత్రుడిని ఇప్పుడు భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. లేట్ గా వచ్చింది.. ఐనా బెటర్ లేట్ దేన్ నెవర్ అన్నారు కదా!

by Jalapathy Gudelli