సినిమా హిట్ అయినా రేటు పెంచలేదు

Sree Vishnu didn't raise paycheck even after success
Wednesday, November 6, 2019 - 21:45

ఓ సినిమా ఇలా హిట్ అవ్వడం ఆలస్యం, అలా రెమ్యూనరేషన్ ను పెంచేస్తుంటారు. ఈ విషయంలో హీరోలు, హీరోయిన్లు, దర్శకులు అనే తేడా లేదు. అంతా ఒకటే. అయితే శ్రీవిష్ణు మాత్రం దీనికి కాస్త భిన్నం. బ్రోచేవారెవరురా సినిమా సక్సెస్ అయినప్పటికీ శ్రీవిష్ణు తన పారితోషికం పెంచలేదు. దీనికి సంబంధించి ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి.

బ్రోచేవారెవరురా రిలీజ్ కు ముందే 3 సినిమాలు ఒప్పుకున్నాడట శ్రీవిష్ణు. అందుకే బ్రోచే హిట్ అయినా, రెమ్యూనరేషన్ పెంచలేకపోయానంటున్నాడు. పైగా ఆ 3 సినిమాలకు సంబంధించిన టెక్నీషియన్లు, నిర్మాతలు తనకు చాలా క్లోజ్ అని, సినిమా సక్సెస్ అయిందని అమాంతం రేటు పెంచలేకపోయానని అంటున్నాడు. అయితే కమిట్ అయిన 3 సినిమాలు పూర్తిచేసిన తర్వాత మాత్రం పారితోషికాన్ని కాస్త సవరిస్తానంటున్నాడు శ్రీవిష్ణు.

కానీ ఇక్కడే చిన్న లాజిక్ మిస్ అవుతున్నాడు ఈ హీరో. బ్రోచేవారెవరురా హిట్ అయిందని, ఎప్పుడో 4 సినిమాల తర్వాతొచ్చే మూవీకి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారు. తిప్పరామీసంతో పాటు ఒప్పుకున్న మరో 2 సినిమాలు కూడా క్లిక్ అయితే, అప్పుడు శ్రీవిష్ణు తను కోరుకున్న విధంగా రేటు పెంచే అవకాశం ఉంది. లేదంటే ఇదే పారితోషికంతో కొనసాగాల్సి ఉంటుంది. అయినా ఈ విషయంలో శ్రీవిష్ణు కంటే ఆయన భార్యదే నిర్ణయాధికారం. మహేష్ కు నమ్రత ఎలాగో, శ్రీవిష్ణుకు ఇలాంటి బిజినెస్ వ్యవహారాల్లో ఆయన భార్య కూడా అలా అన్నమాట.