శ్రీరెడ్డికి లారెన్స్ బంప‌ర్ ఆఫ‌ర్‌

Sri Reddy and Lawrence patch up
Wednesday, October 17, 2018 - 00:30

శ్రీరెడ్డికి, రాజ‌కీయ నాయ‌కుల‌కి పెద్ద తేడా లేదు. అటు రాజ‌కీయ నాయ‌కులు, ఇటు శ్రీరెడ్డి చెప్పే మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి పొంత‌న ఉండ‌దు. వారి ఆరోప‌ణ‌ల‌కి విలువ ఉండ‌దు. తిట్టిన పార్టీలోనే చేరుతారు రాజ‌కీయ నాయ‌కులు. శ్రీ రెడ్డి కూడా అంతే. మొన్న‌టి వ‌ర‌కు లారెన్స్‌పై ఆరోప‌ణ‌లు చేసింది. ఇపుడు అత‌న్ని క‌లిసి.. గొప్పత‌నాన్ని తెలుసుకొంది. అంతేకాదు లారెన్స్ మంచి పాత్ర కూడా ఇచ్చాడ‌ట‌. ప‌నిలోప‌నిగా చేతిలో అడ్వాన్స్ కూడా పెట్టాడ‌ట‌. ఆ ఎమౌంట్‌ని ఆమె తిత్లీ బాధితుల‌కి విరాళంగా ప్ర‌క‌టించేసింది.

"లారెన్స్ ఇంటికి వెళ్లాను. అక్క‌డ ఎంతో మంది చిన్నారులు ఉన్నారు. ఆయ‌న వారి జీవితంలో సంతోషాన్ని నింపుతున్నాడు. అంతేకాదు నాకు మంచి పాత్ర ఇస్తాన‌ని ప్రామిస్ చేశారు. అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. ఈ మొత్తాన్ని శ్రీకాకుళం తుపాను బాధితులకు విరాళంగా ఇస్తాను," అంటూ శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది గ‌ర్వంగా. 

మ‌రి లారెన్స్‌పై చేసిన ఆరోప‌ణ‌ల మాటేమిటి? అలాంటివి అడగొద్దు. శ్రీరెడ్డి ఫేస్‌బుక్ పోస్ట్‌లు, ఆమె ఆరోప‌ణలు, యూట్యూబ్ ఛానెల్స్‌కి, టీవీ చానెల్ రేటింగ్‌ల‌కి ప‌నికొచ్చే స‌ర‌కు త‌ప్ప వాటికి విలువ ఉండ‌దు. పాత్ర ఇస్తే ఆరోప‌ణ‌ల‌న్నీ గ‌ల్లంతవుతాయి. 

లారెన్స్ పాత్ర ఇస్తాన‌ని ఆశ‌చూపి త‌న‌ని లైంగికంగా వేధించాడ‌ని గ‌తంలో ఆమె ఆరోప‌ణ‌లు చేసింది. లారెన్స్‌తో మొద‌లుపట్టి, త‌మిళ హీరో శ్రీరామ్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్‌ల‌పై ఆరోప‌ణ‌లు చేసింది. ఇపుడు చెన్నైలో మ‌కాం వేసింది. అక్క‌డే పూర్తిగా సెటిల్ అయిన‌ట్లు క‌నిపిస్తోంది.