అనుష్క కి ఆ పేరు పెట్టింది ఎవరు?

Story behind Anushka's name
Friday, March 13, 2020 - 11:00

అనుష్క శెట్టి... అసలు పేరు అది కాదు. ఆమె అమ్మానాన్న పెట్టిన పేరు...స్వీటీ. కానీ ఇది ముద్దు పేరులా ఉంది కానీ అసలు పేరులా లేదే అనుకున్నారు పూరి జగన్నాధ్. ఆమెని హీరోయిన్ గా పరిచయం చేసింది ఆయనే. సూపర్ సినిమాలో నాగార్జున సరసన అనుష్క ఇంట్రడ్యూస్ అయింది. ఇంతకీ.... ఆమెకి అనుష్క అనే పేరు ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు?  అనుష్క 15 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో అసలు విషయాన్ని చెప్పారు పూరి జగన్నాధ్... 

ఆయన మాటల్లోనే... 

"ఈ బంగారుత‌ల్లి 'సూప‌ర్' సినిమా హీరోయిన్ కోసం బాంబే వెళ్లిన‌ప్పుడు దొరికింది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి తీసుకెళ్లాను. నాగార్జున‌గారు త‌న‌ను చూడ‌గానే, 'ఈ అమ్మాయ్ చాలా బాగుందే' అన్నారు. 'ఈ అమ్మాయికి ఆడిష‌న్ చేద్దాం సార్' అన్నాను. 'ఆడిష‌న్ ఏమీ అవ‌స‌రం లేదు, పెట్టేద్దాం' అని ఆయ‌న‌న్నారు. అన్న‌పూర్ణ స్టూడియోలోనే వినోద్ బాల ద‌గ్గ‌ర త‌ను యాక్టింగ్ నేర్చుకుంది. డాన్స్ అవీ నేర్చుకొని సూప‌ర్ ఎన‌ర్జీతో 'సూప‌ర్' ఫిల్మ్‌లో చేసింది. అంత‌కుముందు నాగార్జున‌గారు నీ పేరేంట‌ని అడిగితే స్వీటీ అని చెప్పింది. 'కాదు, నీ ఒరిజిన‌ల్ పేరు?' అన‌డిగారు. స్వీటీయేన‌ని, త‌న పాస్‌పోర్ట్ చూపించింది. అందులో ఆ పేరే ఉంది. 'ఇలా కాదు, స్క్రీన్ నేమ్ మంచిది ఉండాలి' అన్నారు నాగార్జున‌గారు. ఆ త‌ర్వాత ఈ పిల్ల‌కు ఏం పేరు పెడ‌దామ‌ని చాలా పేర్లు రాసుకున్నాం. అప్ప‌డు మ్యూజిక్ డైరెక్ట‌ర్ సందీప్ చౌతా 'మిల మిల' అనే పాట రికార్డింగ్ కోసం ఒక అమ్మాయిని పిలిపించాడు. ఆ అమ్మాయి పేరు అనుష్క‌. అది నాకు న‌చ్చి, 'ఈ పేరు ఎలా ఉంది?' అని స్వీటీని అడిగాను. 'బాగానే ఉంది కానీ, నాగార్జున‌గారిని కూడా అడుగుదాం' అంది. ఆయ‌న్ని అడిగితే, మ‌న హీరోయిన్ల‌లో ఎవ‌రికీ ఇలాంటి పేరు లేదు, పెట్టేయొచ్చ‌న్నారు. అలా అనుష్క అనే నామ‌క‌ర‌ణం జ‌రిగింది."

ఆమె ఆశీర్వాదం తీసుకుంటా... పూరి 

"సూప‌ర్‌తో స్టార్ట‌యి, 'నిశ్శ‌బ్దంతో ప‌దిహేనేళ్ల కెరీర్ పూర్తి చేసుకుంటోంది. యు రాకింగ్‌, ల‌వ్ యు.. హ్యాట్సాఫ్‌. ఇందాక అనుష్క ఏవీ చూశాను. హీరోల ఏవీల కంటే చాలా బాగుంది. నాకు గూస్‌బంప్స్ వ‌చ్చాయి. అంద‌రూ చెప్తున్న‌ట్లే అనుష్కనిజంగా చాలా మంచిది. త‌న ద‌గ్గ‌ర చాలా విష‌యాలు నేర్చుకోవాలి. ర‌వితేజ‌, చార్మి, నేను అనుష్క‌ను 'అమ్మా' అని పిలుస్తాం. మేం క‌లిసిన‌ప్పుడ‌ల్లా త‌న కాళ్ల‌కు దండంపెట్టి ఆశీర్వాదం తీసుకుంటాం. ఆమెలో కొన్ని ల‌క్ష‌ణాల‌న్నా మాకు రావాల‌ని కోరుకుంటుంటాం. చాలా మంచిత‌నం, చాలా తెలివితేట‌లు క‌లిసిన కాంబినేష‌న్ అనుష్క‌. నా స్నేహితుడు హేమంత్ మ‌ధుక‌ర్ తీసిన 'నిశ్శ‌బ్దం' సినిమాను నేనిప్ప‌టికే చూశాను. ఫెంటాస్టిక్ ఫిల్మ్‌. అనుష్క‌ మూగ‌మ్మాయిలా చేసింది. నిజంగా మూగ‌దేమో అని నాకే డౌట్ వ‌చ్చింది. ఈ అమ్మాయి 'తెలీదు తెలీదు' అని అన్నీ నేర్చుకొనే ర‌కం. త‌న‌కు హ్యాట్సాఫ్‌. ఈ సినిమా పెద్ద హిట్ట‌వ్వాలి అనుష్కా" అని చెప్పారు పూరి జగన్నాధ్.