అప్పుడు వద్దనుకొని ఇప్పుడు పెట్టేశారు

Story behind Ruler title
Saturday, October 26, 2019 - 22:45

రూలర్.. ఈ టైటిల్ తో ఇప్పటివరకు సినిమా రాలేదు. కానీ టైటిల్ మాత్రం ప్రేక్షకులకు సుపరిచితమే. గతంలో బోయపాటి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమాకు ఇదే టైటిల్ అనుకున్నారు. ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. చివరాఖరికి రూలర్ అనే టైటిల్ తీసేసి దమ్ము అనే టైటిల్ పెట్టారు.

కట్ చేస్తే.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య చేసిన సినిమాకు కూడా ఇదే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అటు డైరక్షన్ డిపార్ట్ మెంట్ నుంచి కూడా ఇదే తరహాలో లీకులు కూడా వచ్చాయి. కానీ ఆ సినిమాకు కూడా రూలర్ అనే పేరు పెట్టలేదు. జైసింహా అంటూ సెంటిమెంట్ టైటిల్ పెట్టి సినిమా వదిలారు.

కానీ ఈసారి మాత్రం అలాంటి మిస్-పైర్స్ లేవు. రూలర్ టైటిల్ ఎట్టకేలకు ఓ సినిమాకు లాక్ అయింది. అది కూడా బాలయ్య-కేఎస్ రవికుమార్ కాంబోలో సినిమాకే కావడం విశేషం. అవును.. ప్రస్తుతం వీళ్లిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ కు రూలర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలా ఈ టైటిల్ కు ఎట్టకేలకు మోక్షం లభించిందన్నమాట.

అన్నట్టు రూలర్ టైటిల్ తో పాటు బాలయ్య లుక్ కూడా రివీల్ చేశారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన పిక్స్ లో టోనీ స్టార్క్ గెటప్ లో కనిపించిన బాలయ్య.. ఈసారి పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించాడు. మీసకట్టు, హెయిర్ స్టయిల్ కూడా మార్చాడు. పనిలోపనిగా చేతిలో పెద్ద సుత్తి కూడా పట్టుకున్నాడు. ఈ క్యారెక్టర్ పేరు ధర్మ అంట. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న థియేటర్లలోకి వస్తున్నాడు రూలర్.