రంగమ్మత్తతో రెండోసారి

Sukumar to repeat Anasuya in his new film
Monday, September 23, 2019 - 18:30

రంగస్థలం సినిమా విడుదలై దాదాపు ఏడాదిన్నర కావొస్తోంది. ఐనా.. ఇంకా కొత్త సినిమా మొదలుపెట్టలేకపోయాడు దర్శకుడు సుకుమార్‌. దానివెనుక జరిగిన రీజన్‌ ఏంటో అందరికి తెలుసు.  సుకుమార్‌ చెప్పిన కథ విషయంలో ఏటూ తేల్చకుండా మహేష్‌బాబు నాన్చాడు. దాంతో కోపంలో అదే కథని బన్నికి చెప్పి ఓకే చేయించుకున్నాడు. ఆ తర్వాత చాలా డ్రామా జరిగింది. ఆ విషయం పక్కన పెడితే... ఇపుడు బన్నితో తీయబోయే సినిమా విషయంలో రంగస్థలం సెంటిమెంట్స్‌ని కొన్ని పాటిస్తున్నాడు. 

సుకుమార్‌ ఇంతకుముందు అన్ని అర్బన్‌బేస్డ్‌ స్టోరీస్‌ తీసేవాడు. రంగస్థలం నుంచి పల్లెటూరి బాట పట్టాడు. ఇపుడు బన్నితో తీయనున్న సినిమా కూడా విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. శేషాచలం అడవుల నేపథ్యంగా సాగే కథ. ఈ సినిమాలో కూడా హీరోయిన్‌ పల్లెటూరి పిల్లే. రంగస్థలం సినిమాలో రామలక్ష్మీ పాత్రలో సమంత అదరగొట్టింది. ఇపుడు రష్మిక అలాంటి పాత్రలో కనిపించనుంది. 

ఇక  రంగస్థలంలో రంగమ్మత్తుగా నటించిన అనసూయని మళ్లీ రిపీట్‌ చేయనున్నాడట.  ఈ కొత్త సినిమాలోనూ ఆమె కోసం ఓ మంచి పాత్రని రాశాడట. ఈ సినిమా వచ్చే నెల మూడున లాంఛనంగా ప్రారంభం కానుంది.