సుకుమార్‌కి నిరీక్ష‌ణ త‌ప్ప‌దు

Sukumar waiting continues
Wednesday, April 24, 2019 - 09:45

సుకుమార్ ద‌ర్శ‌కుడిగా క‌న్నా నిర్మాత‌గా బిజీ అయ్యేందుకు ఆస‌క్తి చూపుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. దాదాపు నాలుగు సినిమాల‌ను ఆయ‌న లైన్లో పెట్టాడు. కో ప్రొడ్యుస‌ర్‌గా, ప్రొడ్యుస‌ర్‌గా సుకుమార్ నాలుగు సినిమాలు తీయ‌నున్నాడు ఈ ఏడాదిలో. అందులో రెండు సినిమాలు ఇప్ప‌టికే మొద‌ల‌య్యాయి. మ‌రో రెండు త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్తాయి.

ఐతే ద‌ర్శ‌కుడిగా ఆయ‌న ఇప్ప‌టికే మ‌హేష్‌బాబు సినిమాని వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. ఇక ఇపుడు అల్లు అర్జున్ సినిమా కూడా అంత తొంద‌ర‌గా మొద‌ల‌య్యేలా లేదు. ఈ రోజు (ఏప్రిల్ 24) అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్ డైర‌క్ష‌న్‌లో సినిమా షురూ చేశాడు. ఇది పూర్తి కావ‌డానికి ఎంత లేద‌న్నా ఆరేడు నెల‌లు ప‌డుతుంది. ఆ వెంట‌నే సుకుమార్ సినిమా మొద‌లుపెడుతాడా అంటే డౌటే అనే చెప్పాలి. 

ఎందుకంటే సుకుమార్ క‌న్నా ముందే ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ బౌండ్ స్ర్కిప్ట్‌తో రెడీగా ఉన్నాడు. "ఐకాన్"పేరుతో మొద‌టి లుక్‌ని కూడా రిలీజ్ చేశాడు. ఇది ఎమోష‌నల్‌ రొమాంటిక్ చిత్రం. చూపు చుట్టూ తిరిగే ఓ క‌థ‌. పెద్ద‌గా యాక్ష‌న్ సీన్లు ఉండ‌వు, గ్రాఫిక్స్ అవ‌స‌రం ఉండ‌దు. సో.. స్పీడ్‌గా తీయ‌డానికి వేణు శ్రీరామ్ రెడీగా ఉన్నాడు. అందుకే బ‌న్ని ఇటు త్రివిక్ర‌మ్‌, అటు వేణు శ్రీరామ్ "ఐకాన్" పూర్తి చేసిన త‌ర్వాతే సుకుమార్ సినిమాని సెట్స్‌పైకి తీసుకొస్తాడ‌ట‌.

అంటే సుకుమార్ "రంగ‌స్థ‌లం" వంటి ఆల్‌టైమ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇచ్చిన త‌ర్వాత కూడా రెండేళ్ల నిరీక్ష‌ణ త‌ప్ప‌డం లేదు.