సూర్య కూడా శివ‌కే ఓటేశాడు

Suriya announces his next film with director Siva
Monday, April 22, 2019 - 23:45

సినిమా ఇండ‌స్ట్రీ విజ‌యానికి స‌లాం అంటుంది. వ‌రుస‌గా హిట్‌లు అందించే ద‌ర్శ‌కుల‌కి మొత్తం హీరోలంద‌రూ బెండ్ అవుతారు. అది తెలుగులో ప‌లువురు హిట్ డైర‌క్ట‌ర్స్ విష‌యంలో చూశాం. ఇపుడు తమిళంలో అలాంటి క్రేజ్ ఉన్న ద‌ర్శ‌కుడు శివ‌. తెలుగులో ఎన్నో సినిమాల‌కి కెమెరామేన్‌గా ప‌నిచేసి.. మ‌న ద‌గ్గ‌రే ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయి ఇపుడు త‌మిళ‌నాట లీడింగ్ డైర‌క్ట‌ర్‌గా ఎదిగాడు శివ‌.

తెలుగులో గోపిచంద్ హీరోగా "శౌర్యం" సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు శివ‌. అది సూప‌ర్‌హిట్‌. ఆ త‌ర్వాత "శంఖం", "దరువు" సినిమాలు తీస్తే ...రెండు ఢ‌మాల్ అన్నాయి. దాంతో త‌మిళంలో సిరుత్తాయ్ (విక్ర‌మార్కుడు రీమేక్‌), వీరం, వేదాలం, వివేకం, విశ్వాసం.. ఇలా వ‌రుస‌గా సినిమాలు డైర‌క్ట్ చేసి టాప్ డైర‌క్ట‌ర్‌గా స్థిర‌ప‌డ్డాడు. ముఖ్యంగా ఇటీవ‌ల అజిత్ హీరోగా తీసిన "విశ్వాసం" ....త‌మిళ‌నాట ఆల్‌టైమ్ బిగ్‌హిట్స్‌లో ఒక‌టిగా నిలిచింది. ర‌జనీకాంత్ న‌టించిన "పేట్టా"తో పోటీప‌డి ఈ సినిమా ఆల్‌టైమ్ బిగ్‌హిట్‌గా త‌మిళ‌నాడులో సంచ‌ల‌నం సృష్టించింది. 

దాంతో సూర్య వెంట‌నే ఈ ద‌ర్శ‌కుడిగా డేట్స్ ఇచ్చాడు. సూర్య‌కి కూడా ఇపుడు హిట్స్ కావాలి. శివ పాత చింత‌కాయ ప‌చ్చ‌డి క‌థ‌ల‌తో సినిమాలు తీస్తాడు. కానీ ఆయ‌న సినిమాలు సామాన్య త‌మిళ ప్రేక్ష‌కుల‌కి బాగా క‌నెక్ట్ అవుతాయి. అందుకే సూర్య ఇపుడు శివ డైర‌క్ష‌న్‌లో నటించ‌నున్నాడు.