ఇదే చివ‌రి షెడ్యూల్‌: రామ్‌చ‌ర‌ణ్‌

Sye Raa last schedule, says Ram Charan
Friday, May 3, 2019 - 17:00

అగ్ని ప్ర‌మాదం పుణ్య‌మాని "సైరా" సినిమా షూటింగ్‌పై క్లారిటీ వ‌చ్చింది. ఏడాదిన్న‌ర‌గా షూటింగ్ జ‌రుపుకుంటున్న "సైరా న‌ర్సింహ‌రెడ్డి" సినిమా ఎపుడు పూర్త‌వుతుంద‌నే విష‌యంలో ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగాయి. సినిమా ఇదే చివ‌రి షెడ్యూల్ అంటూ కొన్ని అవ‌గ‌హ‌న లేని వెబ్‌సైట్‌లు రెండు నెలులుగా వార్త‌లు ప్ర‌చురిస్తూ వ‌చ్చాయి. ఐతే ఇపుడు రామ్‌చ‌ర‌ణ్ పూర్తి క్లారిటీ ఇచ్చాడు.

ఇపుడు మొద‌లుకానున్న కొత్త షెడ్యూల్ చివ‌రిది అని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. శ‌నివారం (మే 4) నుంచి కోకాపేట్‌లో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో చివ‌రి షెడ్యూల్ తీద్దామ‌ని ప్లాన్ చేశారు. ఐతే శుక్ర‌వారం ఉద‌యం అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. "ల‌క్కీగా ఎవ‌రికీ ఏమీ కాలేదు. అంద‌రూ సేఫ్‌. ఈ చివ‌రి షెడ్యూల్ పూర్తి చేయ‌డానికి ఆత్రుత‌గా వేచి చూస్తున్నామ‌," అని రామ్‌చ‌ర‌ణ్ పోస్ట్ చేశాడు.

మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాల‌వాడ న‌ర్సింహ‌రెడ్డిగా న‌టిస్తున్న ఈ మెగా పీరియ‌డ్‌ మూవీ 200 కోట్ల రూపాయ‌ల‌తో తెర‌కెక్కుతోంది. రామ్‌చ‌రణ్ ఈ సినిమాకి నిర్మాత‌. ఈ సెట్‌ని పున‌రుద్ద‌రించిన త‌ర్వాత ఇక్క‌డే చివ‌రి షెడ్యూల్ మొద‌లుపెడుతారు. మే చివ‌రి నాటికి సినిమా షూటింగ్‌కి గుమ్మ‌డికాయ కొట్టాల‌నేది ప్లాన్‌.

చిరంజీవి స‌ర‌స‌న న‌య‌న‌తార‌, త‌మ‌న్న న‌టించారు. సురేంద‌ర్‌రెడ్డి డైర‌క్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.