ఈ పదేళ్ళలో చాలా చూశా: తనీష్

Tanish talks about his decade long acting career
Wednesday, December 19, 2018 - 22:45

బాల నటుడిగా పరిచయం అయిన తనీష్  హీరోగా పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. "న‌చ్చావులే" సినిమాతో హీరోగా అడుగుపెట్టాడు. ఆ సినిమా విడుద‌లై నేటికి ప‌దేళ్లు. నటుడిగా 20 యేళ్ళు, హీరోగా పదేళ్ళ ప్రయాణం పూర్తి అయింది. దాంతో త‌న జ‌ర్నీ వివ‌రాల‌ను మీడియాతో పంచుకున్నాడు.

"నచ్చావులే సినిమా టైం లో నాకు మరొక సినిమా హీరోగా ఆఫర్ వచ్చింది. కానీ ఆ కథ అంతగా నచ్చలేదు. దర్శకుడు రవిబాబు  నన్ను చూసిన వెంటనే నువ్వు తగ్గితే అప్పుడు ఆలోచిస్తా’అన్నారు.  పదిహేను రోజుల్లో పదికేజీలు తగ్గిన తర్వాత తర్వాత రవిబాబు గారిని కలిస్తే ‘ రేపు సినిమా ఓపెనింగ్ వచ్చేయ్’అన్నారు. అపుడు ఇంజ‌నీరింగ్ చదువుతున్నా. నేను రోజూ కాలేజ్‌కి వెళ్లే బ‌స్సులో నా పాటలు ప్లే అయ్యేవి . కానీ అవి నావని చెప్పుకోవాలని ఉన్నా చెప్పలేదు. సినిమా రిలీజ్ రోజు ప్రెండ్స్ తో థియేటర్ కి వెళ్ళాను. బయటికి వచ్చి చూస్తే సినిమా పెద్ద హిట్ అనే రిపోర్ట్ తెలిసింది. ఈ అవాకాశం ఇచ్చిన రామోజీ రావు గారికి రవిబాబు గారికి ఎప్పటికీ రుణ పడి ఉంటాను. బాల నటుడిగా 60కి పైగా సినిమాలు, హీరోగా 20 సినిమాలు కంప్లీట్ చేసాను. 

నా కెరియర్ లో హిట్స్ ఉన్నాయి ప్లాప్స్ ఉన్నాయి.  నేను తెలియక చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను. ఈ పదేళ్ళ జర్నీలో చాలా ఎత్తు పల్లాలు చూసాను. అవి నన్ను రాటు తేల్చాయి.  బిగ్ బాస్ నన్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ప్రతి ఇంటిలోకి తీసుకువెళ్ళింది. ఆ షో నాకు చాలా ఎమోషనల్ మూమెంట్స్ ని మిగిల్చింది. రంగు తర్వాత మరో కథను ఫైనలైజ్ చేసాను."