త‌నుశ్రీ..టాలీవుడ్‌ టు బాలీవుడ్‌

Tanushree Dutta: Bollywood to Tollywood, Tollywood to Bollywood
Friday, September 28, 2018 - 17:15

రంగుల ప్రపంచంలో కథానాయికలు తమ ఒంపుసొంపులు ఫిట్ గా ఉన్నన్ని రోజులే ఒక వెలుగు వెలుగుతారు. వాటి కళ తప్పితే అంతే. కొత్త నీటి ప్రవాహానికి పాత నీరు పోవాల్సిందే. ఆ తరవాత ఎంత చెప్పుకున్నా ఏమీ ఉండదు. అలా కనుమరుగైపోయిన నటి తనుశ్రీ దత్తా మళ్ళీ మెరవాలని కిందామీదా పడుతోంది. అటు సినిమా వాళ్ళు... ఇటు మీడియా దృష్టిలోపడి పాపులారిటి కోసం తెగ ఇదైపోతోంది. ఇందుకోసం టాలీవుడ్ ఫార్ములా తీసుకుంది. ఇక్కడ శ్రీ రెడ్డి ఎంచుకున్న మార్గంలో తనుశ్రీ వెళ్తోంది అని సినిమావాళ్లు చెబుతున్నారు. శ్రీ రెడ్డి మాదిరే హింది సినీ ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తోంది తనుశ్రీ దత్తా.

ఒక పుష్కరం కిందట తెలుగులో ‘వీరభద్ర’లో బాలకృష్ణతో ఆడీపాడీ అందాలు ఆరబోసినా తనుశ్రీని ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. అంతకుముందు "ఆషిక్ బనాయా అప్నే" అనే సినిమాలో ఇమ్రాన్ హష్మితో మాంచి ఘాటైన శృంగార సన్నివేశాల్లో నటించింది ఈ జార్ఖండ్ జాణ. అందులో ఆమె దాదాపు ఓ పోర్న్ ఫిల్మ్ లో చేసినట్లే చేసేసింది. అలా ఎన్ని చిత్రాలు చేసినా ఈమెకి స్టార్ స్టేటస్ మాత్రం దక్కలేదు. 2010 తరవాత తనుశ్రీ తెర మరుగైపోయింది. బౌద్ధం, సన్యాసం అని ఏదో చెప్పింది. అమెరికా వెళ్లిపోయింది అన్నారు. ఇప్పుడు మీడియా ముందు ప్రత్యక్షం అయి ‘మీ టూ’ అంటూ నాపై ఫ్లాష్ బ్యాక్ లో లైంగిక వేధింపులకి పాల్పడ్డారు అంటూ ఒక్కో ఎపిసోడ్ చెబుతోంది. నానా పటేకర్ నన్ను వేధించారు అని బాంబు వేసింది.

ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి అనే దర్శకుడు నన్ను నగ్నంగా డ్యాన్స్ చేయమన్నాడు అంటోంది. ఇంకా ఎవరెవరి మీద ఆరోపణలు చేస్తుందో చూడాలి. దొరికింది కదాని టీవీ చానెళ్లు, వెబ్ చానెళ్లు తనుశ్రీకి తమ గొట్టాలు పెట్టేస్తున్నారు... కొత్త మసాలా విషయాల కోసం. బాలీవుడ్ వాళ్ళు అప్పుడే ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతుంటే ఈ అమ్మడి దగ్గర సమాధానం లేదు. 

ఇప్పుడు తనుశ్రీ ఎంత పాపులారిటీ తెచ్చుకున్నా – ఎవరూ పిలిచి హీరోయిన్ ఛాన్స్ ఇవ్వరు. ఎందుకంటే ఆమె అందచందాలు ఆషిక్ బనాయా అప్నే సినిమాలో ఉన్నట్లు లేవు. మరి ఏమి ఆశించి ఈ ఆరోపణలు చేస్తుందో ఆమెకే తెలియాలి.