క‌ల్యాణ్‌రామ్‌ని వ‌ద‌ల‌ని బాబు!

TDP planning to field Kalyan Ram's sister in Kukatpally
Wednesday, November 14, 2018 - 14:15

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌ని ఈసారి తెలంగాణ ఎన్నిక‌ల బ‌రిలో దింపాల‌ని తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. హైద‌రాబాద్‌లోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గ‌మైన కూక‌ట‌ప‌ల్లి నుంచి క‌ల్యాణ్‌రామ్‌ని బ‌రిలోకి దింపాల‌ని ఇంత‌కుముందు ప్ర‌య‌త్నించారు చంద్ర‌బాబు నాయుడు. ఐతే క‌ల్యాణ్‌రామ్ ఈ ప్ర‌తిపాద‌న‌ని సున్నితంగా తిర‌స్క‌రించాడు.

ఐతే బాబు ఒక‌టి అనుకుంటే అది అయ్యేంత‌వ‌ర‌కు వ‌ద‌ల‌ర‌ని పేరు ఉంది. క‌ల్యాణ్‌రామ్ నో అన‌గానే క‌ల్యాణ్‌రామ్ సోద‌రి సుహాసినిని బ‌రిలోకి దింపాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. మొదట కూక‌ట‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పెద్దిరెడ్డిని నిల‌పాల‌నుకున్నారు. పెద్దిరెడ్డికి టికెట్ కూడా క‌న్‌ఫ‌మ్ చేశారు. వెంట‌నే పెద్దిరెడ్డి కూక‌ట్‌ప‌ల్లిలో సైకిల్ యాత్ర కూడా చేశారు. ఐతే పెద్దిరెడ్డి బ‌రిలో దిగితే సైకిల్ టైర్ పంక్చ‌ర్ అయి కారు (తెరాస‌) దూసుకుపోతుంద‌ని రిపోర్ట్ రావ‌డంతో ఇపుడు కల్యాణ్‌రామ్ చెల్లెలిని ఒప్పిస్తున్నార‌నేది టాక్‌.

ఒక‌వేళ క‌ల్యాణ్‌రామ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ల చెల్లెలు సుహాసిని నిజంగానే బ‌రిలోకి దిగితే ఈ హీరోలిద్ద‌రూ ఆమె త‌రఫున ప్ర‌చారం చేస్తారా అనేది చూడాలి. సొంత‌ చెల్లెలు కాబ‌ట్టి ప్ర‌చారం చేయాలి. ఒక‌వేళ వాళ్లిద్ద‌రూ రంగంలోకి దిగితే ఆమె గెలుపు ఈజీ అయ్యే చాన్స్ ఉంది. ఐతే తెరాసకి వ్య‌తిరేకంగా నంద‌మూరి హీరోలు ప్ర‌చారం చేస్తారా అన్న‌దే పెద్ద ప్ర‌శ్న‌.

త‌న తండ్రి నంద‌మూరి హ‌రికృష్ణ మ‌ర‌ణించిన‌పుడు ఆయ‌న భౌతిక దేహాన్ని ఎన్టీఆర్ ఆఫీస్‌కి తీసుకెళ్దామ‌ని బాబు కోరితే జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ల్యాణ్‌రామ్‌లిద్ద‌రూ నో అని చెప్పారని అప్ప‌ట్లో మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఐనా బాల‌య్య కోర‌డంతో త‌న తండ్రి హ‌రికృష్ణ పాత్రని క‌ల్యాణ్‌రామ్ ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్నాడు. ఈ షూటింగ్ టైమ్‌లోనే బాల‌య్య ద్వారా క‌ల్యాణ్ రామ్ కుటుంబాన్ని కూక‌ట‌ప‌ల్లి బ‌రిలో దించాల‌నే ప్ర‌పోజ్ చేశాడ‌ని స‌మాచారం.