యాస నేర్చుకుంటున్న ముద్దుగుమ్మలు

Telugu actresses are learning various slangs of Telugu language
Wednesday, April 29, 2020 - 16:00

హీరోయిన్ అంటే తెరపై అందంగా కనిపిస్తే చాలు అనే రోజులు పోయాయి. తాజాగా వస్తున్న సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు కూడా ఇంపార్టెన్స్ పెరుగుతోంది. ఆ పాత్రల డిజైనింగ్, మేకింగ్ కూడా కొత్తగా ఉంటోంది. ఇందులో భాగంగా హీరోయిన్లకు కూడా యాస నేర్పిస్తున్నారు మన మేకర్స్.

హీరోయిన్లలో యాస అనగానే చప్పున గుర్తొచ్చే పేరు సాయిపల్లవి. ఫిదా సినిమాలో తన తెలంగాణ యాసలో అందర్నీ కట్టిపడేసింది సాయిపల్లవి. ఇప్పుడు ఇదే యాస తనకు మరో 2 సినిమాలకు పనికొస్తోంది. నాగచైతన్య హీరోగా కమ్ముల డైరక్షన్ లో వస్తున్న లవ్ స్టోరి సినిమాలో కూడా తెలంగాణ పిల్లగా కనిపించనుంది సాయిపల్లవి. దీంతో పాటు రానా హీరోగా వస్తున్న విరాటపర్వంలో కూడా తెలంగాణ అమ్మాయిగానే కనిపించనుంది. ఈ రెండు సినిమాల్లో సాయిపల్లవి మరోసారి తన తెలంగాణ యాసను ప్రజెంట్ చేయబోతోంది.

సాయిపల్లవి తెలంగాణ యాసలో ఇప్పటికే పెర్ ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు రష్మిక వంతు వచ్చింది. ఈమె చిత్తూరు యాస ట్రై చేస్తోంది. అవును.. పుష్ప సినిమాలో ఈమె పాత్ర పక్కా రూరల్ చిత్తూరు యాస మాట్లాడాలి. అందుకే ఈ క్వారంటైన్ టైమ్ ను చిత్తూరు యాస నేర్చుకునేందుకు ఉపయోగించుకుంటోంది రష్మిక.

అటు తమన్న కూడా తొలిసారి యాసలోకి దిగింది. గోపీచంద్ హీరోగా సీటీమార్ అనే సినిమా చేస్తోంది మిల్కీబ్యూటీ. ఈ సినిమాలో జ్వాలాసింగ్ అనే కబడ్డీ కోచ్ గా కనిపించబోతోంది. కేవలం లుక్ లోనే కాదు.. డైలాగ్స్ లో కూడా కొత్తదనం చూపించబోతోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన జ్వాలాసింగ్ పాత్రలో తెలంగాణ యాస మాట్లాడబోతోంది తమన్న. దీనికోసం సంపత్ నంది దగ్గర మస్త్ గా ట్రయినింగ్ తీసుకుందట ఈ పిల్ల.

తమన్న, సాయిపల్లవి, రష్మికతో పాటు ఇప్పుడు యాస అవసరం ప్రియమణికి కూడా వచ్చింది. ఇప్పటివరకు చెప్పుకున్న హీరోయిన్లంతా ఏదో ఒక యాస నేర్చుకుంటే సరిపోయింది. కానీ ప్రియమణికి మాత్రం ఒకేసారి 2 యాసల అవసరం పడింది. వెంకీ హీరోగా నారప్ప చేస్తోంది ఈ హీరోయిన్. ఇందులో ఆమె అనంతపురం రాయలసీమ యాస మాట్లాడబోతోంది. సేమ్ టైమ్, విరాటపర్వంలో కూడా నక్సలైట్ పాత్రలో కనిపించనుంది. ఈ క్యారెక్టర్ తెలంగాణ యాస మాట్లాడాలి. ఇలా ఒకేసారి 2 యాసలు ట్రై చేస్తోంది ప్రియమణి.