మ‌హ‌ర్షి టికెట్ రేట్లు పెంచిందెవ‌రు?

Ticket rates for Maharshi hiked in Telangana but government says
Tuesday, May 7, 2019 - 23:15

"మ‌హ‌ర్షి" సినిమాకి రెండు వారాలు పాటు ఐదు షోలు వేసుకునే అనుమ‌తినిచ్చింది తెలంగాణ ప్ర‌భుత్వం. వేస‌వి సెల‌వుల్లో సినిమాకి ఉండే క్రేజ్‌ని, ర‌ద్దీని చూసుకొని ఈ ప‌ర్మిష‌న్ ఇచ్చింద‌ట‌. ఐతే ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు క‌ల్పించడ‌మే వివాదానికి కార‌ణ‌మ‌వుతోంది. 

ధరల పెంపుకు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని  రాష్ట్ర సినీమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ అనుమతులతో సింగిల్ స్క్రీన్ థియేటర్ లో 80 నుండి 110 రూపాయలు, మల్టిఫ్లెక్స్ థియేటర్ లలో 138 నుండి 200 రూపాయల వరకు సినిమా టికెట్ల ధరలను పెంచినట్లు జ‌రుగుతున్న‌ ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను ఇటీవ‌లి కాలంలో పెంచిన దాఖలాలు లేవని అన్నారు. 

ఆయ‌న చెప్పిన దాంట్లో వాస్త‌వ‌మే ఉంది. ప్ర‌భుత్వం టికెట్ల రేట్ పెంచేందుకు ఎలాంటి అనుమ‌తి ఇవ్వ‌లేదు. మ‌రి టికెట్ రేట్లు పెర‌గ‌లేదా అంటే పెరిగాయి. దానికి కార‌ణం.. గ‌తంలో ఎపుడో హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఇపుడు అప్ల‌యి చేసి... థియేటర్లలో టికెట్ ధరలను పెంచారు. హైకోర్టు ఇచ్చిన ఆ తీర్పు ఈ సినిమాకి ఎలా వ‌ర్తిస్తుందో తెలియ‌దు. ఎక్క‌డో ఏదో లూప్‌హోల్ ఉండి ఉంటుంది...దాన్ని ఆస‌ర‌గా చేసుకొని ఈ సినిమాకి పెంచేశారు. ప్ర‌భుత్వం ప్ర‌మేయం లేదు కానీ... ప్ర‌భుత్వం గ‌ట్టిగా అనుకుంటే పెంచకుండా ఆపొచ్చు.