టాలీవుడ్ నటుడికి కరోనా లక్షణాలు

A Tollywood actor test corona positive?
Monday, March 23, 2020 - 11:15

2 వారాల కిందట బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ లో కొన్ని రోజులున్నాడు. తాజాగా తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చేరుకున్నాడు. వచ్చిన రోజు నుంచి తీవ్రమైన జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. దీంతో అత్యవసరంగా అతడ్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న ఐసోలేషన్ వార్డుకు తరలించి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. అతడు టాలీవుడ్ లో పలు సినిమాల్లో సహాయ నటుడిగా కనిపించాడు.

నిజానికి ఇతడికి వారం రోజుల నుంచే జబులు, జ్వరం ఉంది కానీ గాంధీ ఆస్పత్రికి వెళ్లడానికి ఇష్టపడలేదు. కనీసం హాస్పిటల్ కు కూడా వెళ్లలేదు స్థానికంగా ఉన్న మెడికల్ షాపులో మందులు కొని వేసుకుంటూ వస్తున్నాడు. ఇంటికి చేరిన తర్వాత కూడా ట్రీట్ మెంట్ కు నిరాకరించడంతో.. కుటుంబం సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే గుంటూరు హాస్పిటల్ సిబ్బంది వచ్చి అతడ్ని ఐసొలేషన్ వార్డ్ కు తరలించారు. శాంపిల్స్ కు టెస్టింగ్ కు పంపించారు.

అతడు బ్యాంకాక్ కు ఏ సినిమా పని మీద వెళ్లాడు, అతడి పేరు ఏంటనే వివరాల్ని ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నారు. నిజానికి కరోనా సోకిన బాధితుల వివరాల్ని ఇప్పటివరకు ప్రభుత్వాలు అధికారికంగా వెల్లడించలేదు. ఆ క్రమంలోనే ఈ సహాయ నటుడి వివరాల్ని కూడా గోప్యంగా ఉంచుతున్నారు. అన్నట్టు అతడి కుటుంబ సభ్యుల్ని కూడా ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంచారు. అతడు ప్రస్తుతం పనిచేస్తున్న సినిమా యూనిట్ సభ్యుల వివరాల్ని కూడా తెలుసుకుంటున్నారు.