బ‌న్ని త్రివిక్ర‌మ్ సినిమా ప్ర‌క‌ట‌న వ‌చ్చేనా?

Trivikram and Allu Arjun combo: when will clarity come?
Sunday, October 14, 2018 - 01:00

"అర‌వింద స‌మేత" విడుద‌ల కోసం అల్లు అర్జున్ వెయిట్ చేస్తున్నాడ‌నీ, ఆ సినిమా ఫ‌లితం చూసిన త‌ర్వాత త‌న కొత్త సినిమాని ప్ర‌క‌టిస్తాడ‌నీ చాలా కాలంగా ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎందుకంటే ద‌ర్శ‌కుడు విక్ర‌మ్‌కుమార్ చెప్పిన క‌థ పూర్తిగా న‌చ్చ‌క‌పోవ‌డంతో త్రివిక్ర‌మ్‌తో మూవీ చేయాల‌ని భావిస్తున్నాడు అల్లు అర్జున్‌. కానీ బ‌న్ని అర‌వింద స‌మేత రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూసి ఓ నిర్ణ‌యం తీసుకుందామ‌ని ఆగాడ‌నేది ఇండ‌స్ట్రీ టాక్‌.

అర‌వింద స‌మేత క‌ల‌క్షన్ల ప‌రంగా త‌న స‌త్తా చాటుతోంది. తొలి క‌లెక్ష‌న్ల‌ని బ‌ట్టి చూస్తే ఎన్టీఆర్‌కి మంచి విజ‌య‌మే ఇది. ఈ మూవీ రేంజ్ ఏంట‌నేది ఇపుడే చెప్ప‌లేం. మొద‌టి వారం ర‌న్ పూర్త‌యిన త‌ర్వాత అర్ధ‌మ‌వుతుంది. మ‌రి బ‌న్ని ఇపుడు నిర్ణ‌యం తీసుకుంటాడా? లేక ద‌స‌రా వ‌ర‌కు అర‌వింద స‌మేత ఎలా ఆడుతుందో చూసి డెసిష‌న్ తీసుకుంటాడా అనేది చూడాలి. 

ఇన్‌సైడ్ స‌మాచారం ప్ర‌కారం.. అర‌వింద స‌మేత సినిమాలో ఎన్టీఆర్‌ని చూపిన విధానం, కొన్ని సీన్లు తీసిన తీరు చూసి బ‌న్ని ఫిక్స్ అయిపోయాడ‌ట గురూజీతోనే వెళ్లాల‌ని. త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్లో మూవీ గురించి ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌నేది స‌న్నిహిత వ‌ర్గాల క‌థ‌నం. 

త్రివిక్ర‌మ్‌తో ఇప్ప‌టికే రెండు సినిమాలు చేశాడు బ‌న్ని. అల్లు అర్జున్ మార్కెట్‌ని ఒక్క‌సారిగా పెంచిన ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మే. జులాయి సినిమాతో 40 కోట్ల మార్కెట్‌ని అందుకున్నాడు బ‌న్ని. అంత‌కుముందు పాతిక కోట్ల వ‌ద్ద త‌చ్చాడుతుండేవాడు. ఇపుడు బ‌న్ని రేంజ్ మొత్తంగా మారింది. అత‌ను ఇపుడు అగ్ర‌హీరోల్లో ఒక‌డు.