మహేష్ వద్దంటున్నా వదలడం లేదుగా!

Two directors want only Mahesh Babu's project
Thursday, April 30, 2020 - 15:30

సాధారణంగా ఓ హీరో వద్దన్న తర్వాత దర్శకుడు కొన్నాళ్ల పాటు అటువైపు చూడడు. వెంటనే మరో ప్రాజెక్టుతో బిజీ అయిపోతాడు. లేదంటే ఇతర హీరోల వద్దకు వెళ్లిపోతాడు. కానీ ఇక్కడో ఇద్దరు దర్శకుల పరిస్థితి మాత్రం కాస్త తేడాగా ఉంది. మహేష్ వద్దన్నప్పటికీ వీళ్లు అతడ్ని వదలడం లేదు. మహేష్ కోసమే పనిచేస్తున్నారు. ఎప్పటికైనా మహేష్ తో సినిమా తీస్తామంటున్నారు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ పాటికి మహేష్ తో కలిసి వంశీ పైడిపల్లి సెట్స్ పై ఉండాలి. కానీ ఆఖరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ నుంచి మహేష్ తప్పుకున్నాడు. అయితే వంశీ పైడిపల్లి మాత్రం తప్పుకోలేదు. మహేష్ తో సినిమా కచ్చితంగా ఉంటుందని ప్రకటించాడు. ప్రస్తుతం ఇతడు అదే పనిలో ఉన్నాడు.

మరో దర్శకుడు సందీప్ రెడ్డి వంగది కూడా ఇదే పరిస్థితి. గతంలో మహేష్-సందీప్ మధ్య స్టోరీ డిస్కషన్లు జరిగాయి. కానీ ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవ్వలేదు. దీంతో అతడు ప్రభాస్ ను సంప్రదించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే చుట్టూతిరిగి సందీప్ రెడ్డి మళ్లీ మహేష్ తోనే చర్చలు షురూ చేశాడు.

చూస్తుంటే.. వీళ్లిద్దరూ మహేష్ తో తప్ప మరో హీరోతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు లేదు. త్వరలోనే మహేష్ తో వీళ్లిద్దరూ సినిమాలు చేయాలని కోరుకుందాం.