హస్తానికి చెయ్యి ఇచ్చిన ఊర్మిళ

Urmila quits Congress party
Tuesday, September 10, 2019 - 18:45

కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఊర్మిళ కూడా హస్తం పార్టీకి హ్యండిచ్చింది. కాంగ్రెస్‌ పార్టీకి టాటా బైబై చెప్పేసింది.  పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో విసిగిపోయి కాంగ్రెస్‌ని వీడుతున్నట్లు తెలిపింది. ఆర్నెళ్లల్లోనే ఆమె పార్టీకి బైబై చెప్పడం విశేషం. పార్లమెంట్‌ ఎన్నికలకి కొద్ది నెలల ముందు రంగీలా భామ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకొని పోల్స్‌కి గ్లామర్‌ తీసుకొచ్చింది. ముంబై నార్త్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి గత మార్చి ఎన్నికల బరిలో దిగిన ఊర్మిళకి రెండు లక్షలకి పైగా వోట్లు పోలయ్యాయి. ఐతే ఆమెపై బీజేపీ అభ్యర్థి గెలిచారు. ఆ తర్వాత కూడా పార్టీలో చాలా యాక్టివ్‌గానే ఉంది ఊర్మిళ. 

వచ్చే నెలలో మహారాష్ర్ట అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ టైమ్‌లో ఆమె కరిష్మా...పార్టీకి ఉపయోగపడుతుందని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తున్న తరుణంలో ఆమె హ్యండిచ్చింది. స్టార్‌ క్యాంపెయనర్‌ని మహారాష్ట్ర కాంగ్రెస్‌ కోల్పోయింది. 40 ప్లస్‌ ఊర్మిళ తెలుగులోనూ అనేక సినిమాల్లో నటించింది. వర్మ సపోర్ట్‌తో అనేక హిట్‌ సినిమాల్లో కనిపించింది. ఐతే ఇటీవల ఊర్మిళ క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గానే దర్శనమిస్తోంది. 

కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఆర్నెళ్లకిపైగా ఇమడలేకపోయింది ఒకప్పటి గ్లామర్‌ క్వీన్‌.