పైసావ‌సూల్ నిర్మాత‌కి టెన్స‌న్‌

V Ananda Prasad in tension
Sunday, December 9, 2018 - 11:30

తెలంగాణ ఎన్నిక‌లు ముగిసినా, ఫ‌లితాలు మంగ‌ళ‌వారం నాడు వ‌స్తాయి. పోలింగ్‌కి, ఫ‌లితాల‌కి చాలా గ్యాప్ ఉండ‌డంతో అభ్య‌ర్థుల్లో టెన్స‌న్ రోజురోజుకి పెరుగుతోంది. త‌మ భ‌విత అంతా ఈవీఎంల‌లో నిక్షిప్తం అయింది, అందులో ఉన్న గుట్టు ఏంటో తెలియ‌క టెన్స‌న్‌. దానికి తోడు బెట్టింగ్ మాఫియా పుకార్లు మ‌రింత‌గా అయోమ‌యంలో ప‌డేశాయి. 

పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం కాక‌ముందు..తెలుగుదేశం పార్టీకి ష్యూర్‌షాట్ విన్ అనిపించిన నియోజ‌క‌వ‌ర్గాలు రెండు...ఒక‌టి కూక‌ట్‌ప‌ల్లి, రెండు శేరిలింగంప‌ల్లి. కూక‌ట్‌ప‌ల్లి క‌న్నా శేరిలింగంప‌ల్లి ప‌క్కాగా గెలుస్తార‌ని ప‌లువురు విశ్లేషించారు. ఒక సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు అక్క‌డ అధికంగా ఉన్నారనీ, విజ‌యం సునాయ‌స‌మే అని తీర్మానించారు. అందుకే  పైసావసూల్ నిర్మాత ఆనంద‌ప్ర‌సాద్ ప‌ట్టుబ‌ట్టి, బాల‌కృష్ణ‌తో రిక‌మెండ్ చేయించుకొని టీడీపీ టికెట్ తెప్పించుకున్నారు. బ‌రిలోకి దిగిన త‌ర్వాతే టెన్స‌న్ మొద‌లైంద‌ట‌.

తెరాస అభ్య‌ర్థి అరిక‌పూడి గాంధీని త‌క్కువ అంచ‌నా వేశారు. ఇద్ద‌రిదీ ఒకే సామాజిక వ‌ర్గం. ఏ సామాజిక వ‌ర్గం ఓట‌ర్ల‌ను న‌మ్ముకున్నారో వారిలోనే చీలిక వ‌చ్చింద‌ట‌. తీర్పు ఏక‌ప‌క్షంగా ఉంటుందనుకున్నారు కానీ స‌న్నివేశం అలా లేదు, మొద‌ట అనుకున్న స్ర్కిప్ట్‌లో లేనివి చాలా యాడ్ అయ్యాయ‌ని అర్థ‌మ‌యింది. 

అందుకే ఈ క్లిఫ్‌హ్యంగ‌ర్‌లాంటి క్ల‌యిమాక్స్‌లో ఆయ‌న ఊపిరి బిగ‌ప‌ట్టి కూర్చున్నారు. ఆయ‌న‌ ఎన్నిక‌ల చిత్రం క్ల‌యిమాక్స్ హ్య‌పీ ఎండింగేనా? డిసెంబ‌ర్ 11 మ‌ధ్యాహ్నానికి టాక్ వ‌చ్చేస్తుంది.