టాలీవుడ్ స్టేట్ గవర్నర్ నరేష్‌!

V K Naresh alias His Excellency Naresh!
Saturday, October 20, 2018 - 23:30

‘మా’వాళ్ళు ఏం చేసినా చిరిగి చేటంత అయి పేటంత కావాల్సిందే. అది వివాదం కావచ్చు... విరాళం కావచ్చు. శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకొనేందుకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ రూ.5 లక్షల చెక్కును ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చింది. 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఒక లేఖను కూడా జత చేసి మరీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకి హైదరాబాద్ లో ఆ చెక్కు ఇచ్చారు. ఆ లేఖను చూశాకా ‘మా’ ప్రధాన కార్యదర్శిగా ఒక రాష్ట్ర గవర్నర్ నో,  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తినో పెట్టుకొన్నారనే అభిప్రాయం కలిగితే అది ఎవరి తప్పూ కాదు. ఎందుకంటే ప్రధాన కార్యదర్శి నరేష్‌ ఉరఫ్ వి.కె.నరేష్‌ ముందు డాక్టర్... ఆ గౌరవ డాక్టరేట్ కి ముందు H.E. అని ఉంటుంది.

ఆయన మగవాడు కాబట్టి హీ అనే ఉద్దేశంతో పెట్టి ఉంటారు అనుకోవద్దు. ఆ ఇంగ్లిష్ అక్షరాలకి అర్థం హిస్ ఎక్స్ లెన్సీ అనీ అర్థం. రాష్ట్రపతి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాంటి రాజ్యాంగబద్ధమైన ఉన్నత స్థానంలో ఉన్నవారికి గౌరవ సూచకంగా హిస్ ఎక్స్ లెన్సీ అని చెప్పేందుకు H.E. అని రాస్తారు.

మరి నరేష్‌ పేరు ముందు ‘మా’వాళ్ళకి తెలిసి రాశారా.. తెలియక రాశారా? అదీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉద్దేశించిన లేఖలో! అసలు నరేశ్ కి వచ్చి డాక్టరేట్ కే ఎలాంటి విలువ లేదని ఫిల్మ్ నగర్లో కామెడీ చేస్తుంటారు. ఇప్పుడు హిస్ ఎక్స్ లెన్సీ అని ఒకటి. మరి ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా ఏం పాపం చేశాడో ఆయన పేరు ముందు హిస్ ఎక్స్ లెన్సీ అనే వేయలేదు. 

ఇక ఇచ్చింది రూ.5 లక్షల విరాళం... ఆ చెక్కు మోసుకొని వెళ్ళి గంటా చేతిలో పెట్టింది పది మంది. థాంక్స్... అమరావతి వరకూ వెళ్ళి అంత భారీ మొత్తం ఇవ్వలేదు... వెళ్తే విమానం, హోటల్ ఖర్చులు రూ. 5 లక్షల కంటే ఎక్కువే అయ్యేవి.