చివరికి వాల్మీకే తగ్గాడుగా

Valmiki postponed to Sep 20
Monday, August 26, 2019 - 23:45

నాని వెర్సస్ వరుణ్ తేజ్ అన్నట్లుగా నిన్నటి వరకు హడావిడి సాగింది. సెప్టెంబర్ 13న విడుదల అని నాని నటించిన 'గ్యాంగ్ లీడర్', వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ తీస్తున్న 'వాల్మీకీ' సినిమాలు ఇప్పటివరకు ప్రచారం చేసుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇందులో ఒక సినిమా పోటీ నుంచి తప్పుకొంది.

రెండు సినిమాల మధ్య పోటీ అని రాసినప్పుడల్లా దర్శకుడు హరీష్ శంకర్ ...పోటీ కాదు ఇది రెండు సినిమాల సెలెబ్రేషన్ అని ట్విట్టర్ లో కవర్ డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు. అయితే, ఇప్పుడు నాని పంతం నెగ్గింది, వాల్మీకి వెనక్కి వెళ్ళింది అనేది ట్రేడ్ వర్గాల మాట. రెండు సినిమాలు పోటీపడితే రెండింటికి నష్టమే. ఓపెనింగ్స్ లో చీలిక వస్తుంది. అటు నాని గాని, ఇటు వరుణ్ తేజ్ గాని కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ తెచ్చే స్టార్స్ కాదు. మీడియం రేంజ్ లో ఉంటాయి వారి ఓపెనింగ్స్. పోటీ పడితే కల్లెక్షన్స్ స్ప్లిట్ అవుతాయి. అందుకే నాని సినిమా ముందు ప్రకటించినట్లే సెప్టెంబర్ 13కే వస్తుందట. వాల్మీకి ఒక వారం తర్వాత సెప్టెంబర్ 20న రిలీజ్ అవుతుంది.

నాని'స్ గ్యాంగ్ లీడర్ మొదట ఆగష్టు 30న రిలీజ్ కావాలనుకొంది. వాల్మీకి మొదటి డేట్..సెప్టెంబర్ 6. 'సాహో' కారణంగా రెండు సినిమాలు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సో ఆర్డర్ ప్రకారం 'గ్యాంగ్ లీడర్' ముందు రావాలి కాబట్టి దానికి వే ఇచ్చి వాల్మీకి వెనక్కి వెళ్ళాడు.