హీరోయిన్లంతా అబద్ధాలు చెబుతున్నారు

Varalakshmi responds on Me Too
Tuesday, October 30, 2018 - 20:15

ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డం హీరోయిన్ వరలక్ష్మి స్టయిల్. కాస్టింగ్ కౌచ్ పై కూడా ఈ హీరోయిన్ తనదైన స్టయిల్ లో రియాక్ట్ అయింది. కొంతమంది హీరోయిన్లు తమకు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు లేవని, ఇంత వరకు తమను ఎవరూ టచ్ చేయలేదని అంటున్నారని, అలాంటి మాటలు అస్సలు నమ్మొద్దని అంటోంది వరలక్ష్మి. వాళ్లంతా అబద్ధాలు చెబుతున్నారని అంటోంది.

హైదరాబాద్ వచ్చిన ఈ బ్యూటీ మీడియాతో మాట్లాడుతూ, మీ టూ ఉద్యమంపై రియాక్ట్ అయింది. రెండేళ్ల కిందటే హాలీవుడ్ లో ప్రారంభమైన ఈ మూవ్‌మెంట్, సౌత్ కు రావడం చాలా ఆనందంగా ఉందంటోంది. మీ-టూ రాకతో కోలీవుడ్ లో వందశాతం భయం వచ్చిందని, ఎక్కడ తమ పేరు బయటకొస్తుందోనని చాలామంది భయపడి చస్తున్నారని సెటైర్లు వేసింది వరలక్ష్మి.

ఇన్నేళ్లలో తనకు మాత్రం కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురుకాలేదంటోంది. 22 సినిమాలు చేసిన తనను, ఇప్పటివరకు ఎవరూ సెక్సువల్ ఫేవర్స్ అడగలేదని అంటోంది. శరత్ కుమార్ కూతురుగా తనకున్న బ్యాక్ గ్రౌండ్ వల్ల వేధింపుల నుంచి ఈజీగా తప్పించుకోగలిగానని, కానీ సినిమాల్లోకి రాకముందు యుక్తవయసులో తను లైంగిక వేధింపులకు గురయ్యానని ప్రకటించింది వరలక్ష్మి.

మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా విశాల్ తో వివాహంపై కూడా ఈ బ్యూటీ రియాక్ట్ అయింది. విశాల్ తనకు సోల్ మేట్ అని, బెస్ట్ ఫ్రెండ్స్ కంటే ఇంకాస్త ఎక్కువగా తామిద్దరం కలిసిమెలిసి ఉంటామని చెబుతోంది. అంతేతప్ప, పెళ్లి చేసుకుని కలిసి జీవించాలనే ఉద్దేశం మాత్రం తమకు లేదని స్పష్టంచేసింది.

ఎవరో ఒకర్ని తొందరగా పెళ్లి చేసుకొని పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాలని తనే పదేపదే విశాల్ ను అడుగుతుంటానని కూడా చెబుతోంది వరలక్ష్మి.