వరలక్ష్మీ వచ్చేస్తోంది తప్పుకోండి!

Varalakshmi Sharat Kumar debuts in Tollywood
Tuesday, February 12, 2019 - 17:00

శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ రెండు రకాలుగా తెలుగు ప్రేక్షకులకు తెలుసు. వీటిలో ఒకటి హీరో విశాల్ తో ఎఫైర్. గతంలో వీళ్లిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారంటూ రూమర్లు వచ్చాయి. అప్పుడు టాలీవుడ్ జనాలకు ఆమె గురించి తెలిసొచ్చింది. అదిప్పుడు లేదనుకోండి. అది వేరే విషయం. 

ఇక రెండో విషయం ఏంటంటే.. రీసెంట్ గా వచ్చిన "పందెంకోడి-2", "సర్కార్" సినిమాల్లో ఆమె నెగెటివ్ షేడ్స్ లో కనిపించింది. ఈ రెండు సినిమాలు తెలుగులోకి కూడా వచ్చాయి. రెండూ ఓ మోస్తరుగా జనాల్ని ఆకట్టుకున్నాయి. అలా వరలక్ష్మి ఈమధ్య తెలుగులో పాపులర్ అయింది. దీనికితోడు "పందెంకోడి-2" టైమ్ లో ఆమె డైరక్ట్ గా తెలుగులో ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. 

అలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన వరలక్ష్మి.. ఇప్పుడు నేరుగా తెలుగులో సినిమా చేయబోతోంది. సందీప్ కిషన్, హన్సిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "తెనాలి రామకృష్ణ ఎల్ఎల్బి" సినిమాలో వరలక్ష్మిది ఓ ప్రత్యేకమైన పాత్ర. కాకపోతే అది నెగెటివా.. పాజిటివా అనేది మాత్రం చెప్పడం లేదు. ఈ నెల 16 నుంచి వరలక్ష్మి ఈ సినిమా సెట్స్ పైకి జాయిన్ అవుతుంది. ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ, తన పాత్రకు తానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటానంటోంది.