రెండో సినిమాకే రీమేక్కా!

Venkatesh Maha remakes Maheshinte Pratikaaram
Wednesday, December 25, 2019 - 23:00

దర్శకుడు వెంకటేష్ మహా తీసిన తొలిచిత్రం 'కేరాఫ్ కంచరపాలెం' విమర్శకుల ప్రశంసలు అందుకొంది. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా చేసాడని పేరు తెచ్చుకున్నాడు. ఈ దర్శకుడి నుంచి మరిన్ని సరికొత్త సినిమాలు వస్తాయని భావించారు అంతా. కానీ ఈ దర్శకుడు రెండో సినిమాకే కథలు అరువు తెచ్చుకొని నిరాశ పరుస్తున్నాడు. రీమేక్ సినిమా చేస్తున్నాడు. మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రాన్ని వెంకటేశ్ మ‌హ తెలుగులో రీమేక్ చేశాడు. ఏప్రిల్ 2020లో విడుదల కానుంది. ఈ చిత్రానికి తెలుగులో `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూపాశ్య‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

`మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` ... గత దశాబ్ద కాలంలో వచ్చిన గొప్ప మలయాళ చిత్రాల్లో ఒకటిగా పేరు తెచ్చుకొంది. ఆ సినిమా గొప్పదే కానీ... రెండో సినిమాకే రీమేక్ ని ఎంచుకొని ఈ దర్శకుడు ఈజీ రూట్ ఎంచుకొన్నాడు. 

తెలుగునాట దర్శకులు 'కథల' లేమితో ఇబ్బంది పడుతున్నారు అనడానికి ఇది లేటెస్ట్ ఉదాహరణ. 

ఆర్కా మీడియా వ‌ర్క్స్,  మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై  శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా  తీస్తున్న 
ఈ సినిమాలో సత్యదేవ్ ను హీరోగా తీసుకున్నారు. ఇస్మార్ట్ శంకర్, రాగల 24 గంటల్లో లాంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. జస్ట్ 36 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి, ఏప్రిల్ 17న సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.