వెంకీ మామ క‌థ మార్చేస్తున్నారా?

Venky Mama getting new script
Wednesday, January 30, 2019 - 13:15

"ఎఫ్ 2" స‌క్సెస్ త‌ర్వాత వెంక‌టేష్ సినిమాల‌కి డిమాండ్ పెరిగింది. "ఎఫ్ 2" వెంకీ న‌టించిన సోలో సినిమా ఏమీ కాదు. కానీ వెంకీకే ఈ స‌క్సెస్‌లో ఎక్కువ క్రెడిట్ ద‌క్కింది. 70 కోట్ల‌కి పైగా షేర్ అందుకున్న ఎఫ్ 2 త‌ర్వాత వెంకీ న‌టించ‌బోయే కొత్త సినిమాల‌కి క్రేజ్ మొద‌లైంది. మ‌రి ఈ క్రేజ్‌ని ఉప‌యోగించుకోక‌పోతే ఎలా? అని "వెంకీ మామా" మేక‌ర్స్ ఆల్రెడీ రంగంలోకి దిగారు. ఇపుడు క‌థ‌ని మార్చేస్తున్నార‌ట‌.

వెంకీ మామా సినిమాని గ‌తేడాది అక్టోబ‌ర్‌లోనే ప్ర‌క‌టించారు. డిసెంబ‌ర్ నుంచి షూటింగ్ అని చెప్పారు కానీ ఇంత‌వ‌రకు మొద‌లుపెట్ట‌లేదు. ఈ గ్యాప్‌లో ఎఫ్‌2 విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో వెంకీ మామా నిర్మాత‌ల‌కి మంచి ఊపు వ‌చ్చింది. ఇది కూడా మ‌ల్టీస్టార‌రే. చైత‌న్య ఒక క‌థానాయ‌కుడు.

మేన‌ల్లుడు చైత‌న్య‌తో క‌లిసి వెంకీ న‌టించనుండ‌డం ఒక ప్ల‌స్ అయితే ఎఫ్‌2 త‌ర్వాత మూవీ కావ‌డం మ‌రో అడ్వాంటేజీ. సో..బిజినెస్ క్రేజ్ మామూలుగా ఉండ‌దు. ఐతే వెంకీ పాత్ర పెద్ద‌గా ఉంటేనే జనం వ‌స్తారు. అలాగే కామెడీ బాగుండాలి. ఇపుడు ఆ విష‌యంలోనే ముందు అనుకున్న క‌థ‌ని మార్చుతున్నార‌ట‌. వెంక‌టేష్ క్యార‌క్ట‌రైజేష‌న్‌ని చాలా ఫ‌న్నీగా మార్చేస్తున్నార‌ట‌.

ఈ సినిమాకి డైర‌క్ట‌ర్ బాబీ. క‌థ అందిస్తున్నది కోన వెంక‌ట్‌. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమాలో వెంకీ స‌ర‌స‌న శ్రియాని తీసుకోవాల‌ని మొద‌ట అనుకున్నారు. మ‌రి ఇపుడు కూడా ఆమెనే తీసుకుంటారా మ‌రో అంద‌మైన భామ‌ని చూస్తారా అనేది చూడాలి. నాగ చైత‌న్య స‌ర‌స‌న ర‌కుల్ న‌టించ‌నుంది.