ట్రోలింగ్ పై క్లారిటీ ఇచ్చిన విజయ్

Vijay responds on trolling
Monday, July 8, 2019 - 20:00

తమ్ముడి సినిమా వదిలేసి, పక్కోడి సినిమాపై ట్వీట్లు పెడుతున్నాడు. 
తమ్ముడితో విజయ్ దేవరకొండకు పడడం లేదు.
తమ్ముడి కోసం ప్రచారం చేయని శాడిజం విజయ్ దేవరకొండది..

మొన్నటివరకు ఈ హీరోపై ఇలా ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది. ఓ వైపు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతుంటే.. విజయ్ దేవరకొండ మాత్రం అవేం పట్టనట్టు వ్యవహరించాడు. చివరికి దొరసాని సినిమా టీజర్ ను కూడా షేర్ చేయలేదు. అదే టైమ్ లో మరో సినిమా ట్రయిలర్ ను షేర్ చేయడంతో విజయ్ దేవరకొండ భయంకరంగా ట్రోలింగ్ కు గురయ్యాడు. 

ఎట్టకేలకు ఆ ట్రోల్స్ కు సమాధానమిచ్చాడు విజయ్. దొరసారి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ.. తన తమ్ముడ్ని, అతడి సినిమాను కావాలనే దూరంపెట్టినట్టు స్పష్టంచేశాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తగా తనకు ఎవరూ తెలియదని, స్క్రిప్ట్ ఎంపిక నుంచి ప్రతి విషయాన్ని సొంతంగా నేర్చుకున్నానని తెలిపిన విజయ్ దేవరకొండ.. తమ్ముడికి కూడా ఆ కష్టం తెలియాలనే ఉద్దేశంతో దూరం పెట్టినట్టు స్పష్టంచేశాడు. 

సినిమా అవకాశాల్లేని టైమ్ లో తను, తన కుటుంబం తమ్ముడు ఆనంద్ దేవరకొండ సంపాదన మీద బతికిన విషయాన్ని విజయ్ దేవరకొండ బయటపెట్టాడు. ఆనంద్ అమెరికాలో ఉద్యోగం చేస్తూ, ఇంటికి డబ్బులు పంపించేవాడని.. ఆ డబ్బుతో మేం బతికామని తెలిపిన విజయ్.. అలాంటి తమ్ముడికి ఏం చేయలేకపోతున్నాననే బాధ మనసులో ఉన్నప్పటికీ.. కష్టం తెలియాలనే తమ్ముడికి దూరంగా ఉన్నానని స్పష్టంచేశాడు. 

ఇప్పుడు కూడా దొరసాని సినిమా మనసుకు నచ్చింది కాబట్టే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు వచ్చానని, నచ్చకపోతే అస్సలు వచ్చి ఉండేవాడిని కాదని స్పష్టంచేశాడు. దొరసాని సినిమాను ఏదో ఒక జానర్ కింద చూడొద్దని, ఇదొక జర్నీలాంటి సినిమా అని అంటున్నాడు విజయ్ దేవరకొండ