విజ‌య నిర్మ‌ల‌ని కృష్ణ ఎపుడు పెళ్లాడారు?

When did Krishna marry Vijaya Nirmala?
Thursday, June 27, 2019 - 23:00

సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, విజ‌య నిర్మ‌ల తొలిసారిగా క‌లిసి న‌టించింది...బాపు తీసిన "సాక్షి" సినిమాలో. 1967లో విడుద‌లయింది ఆ సినిమా. ఆ మూవీ షూటింగ్ పులిదిండి అనే గ్రామంలో జ‌రిగింది. షూటింగ్ జ‌రుగుతున్న‌పుడే... ఆనాటి క‌మెడియ‌న్ రాజాబాబు వీరి మ‌ధ్య బంధాన్ని చూసి పెళ్లి చేసుకుంటార‌ని చెప్పాడ‌ట‌. పైగా ఈ సినిమాలోనూ వీరి మ‌ధ్య పెళ్లి సీన్ ఉంది. అది ఓ గుళ్లో తీశారు. వేణుగోపాల స్వామికి మీసాలు ఉన్న గుడి అది. పెళ్లికాని అమ్మాయిలు కోరుకుంటే ఏడాది తిర‌క్కుండానే పెళ్లి అయ్యేలా ఆ స్వామి చేస్తాడ‌ని అక్క‌డి వారి న‌మ్మ‌కం అట‌. ఆ గుడి మ‌హ‌త్యం అలాంటిద‌ని చెపుతూ మీరిద్ద‌రూ ఏడాది తిరిగేలోపు భార్య‌భ‌ర్త‌లు అవుతార‌ని రాజాబాబు అన్నార‌ట‌.

అప్ప‌టికే సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కి పెళ్ల‌యింది. విజ‌య నిర్మల‌కి పెళ్లయి ..భ‌ర్త నుంచి విడిపోయి ఉన్నారు. న‌రేష్ పుట్టాడు. ఐతే "సాక్షి" త‌ర్వాత అప్ప‌టికే "మంచి కుటుంబం", "అత్తాగారి కొత్త కోడ‌లు" వంటి సినిమాల్లో న‌టించ‌డం, ఆ టైమ్‌లో ఇద్ద‌రి మ‌ధ్య అనుబంధం పెరిగింది. 1968 చివ‌ర్లో ఆమెని పెళ్లాడారు కృష్ణ‌. వీరి పెళ్లి సంచ‌ల‌నం క‌లిగించింది. రాజాబాబు చెప్పిన‌ట్లే ఏడాది గ్యాప్‌లోనే వీరి పెళ్లి జ‌రిగింది.

మొద‌ట్లో వారి పెళ్లి వార్త‌ని దాచి పెట్టారు. అయితే మ‌ళ్లీ "అమ్మ కోసం" సినిమాలో క‌లిసి న‌టించ‌డం మొద‌లుపెట్టిన త‌ర్వాత వీరి వివాహ బంధం వార్త బ‌య‌టికి వ‌చ్చింది. ఇద్ద‌రూ క‌లిసి దాదాపు 43 సినిమాల్లో న‌టించారు.