వ‌ర్మ మూడు నెల‌ల్లో తీస్తాడా?

When will Lakshmis NTR begin regular shoot?
Thursday, October 25, 2018 - 23:00

"లక్ష్మీస్ ఎన్టీఆర్" చిత్రాన్ని తిరుప‌తిలో గ్రాండ్‌గా అనౌన్స్ చేశాడు రాంగోపాల్ వ‌ర్మ‌. జ‌న‌వ‌రి 24న సినిమాని రిలీజ్ చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. అంటే కేవ‌లం మూడు నెల‌ల్లో సినిమాని పూర్తి చేసి విడుద‌ల చేయాలి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ పాత్ర‌ని ఎవ‌రు పోషిస్తారు, ల‌క్ష్మీ పార్వ‌తిగా ఎవ‌రు న‌టిస్తారు అన్న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌లేదు. 

రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా షురూ చేయ‌లేదు. ఐదు రోజుల్లో కూడా సినిమా తీయ‌గ‌ల స‌త్తా ఉంది వ‌ర్మ‌కి. దొంగ‌ల‌ముఠా అనే సినిమాని కేవ‌లం ఐదే ఐదు రోజుల్లో పూర్తి చేసి విడుద‌ల చేశాడు. అలాగే ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌తో ఒక షార్ట్ ఫిల్మ్‌ని మూడు గంట‌ల్లో పూర్తి చేశాడు. అంత‌టి మావ‌రిక్ వ‌ర్మ‌. సో....మూడు నెల‌ల్లో ఈ బ‌యోపిక్‌ పూర్తి చేయ‌డం ఆయ‌న‌కి క‌ష్ట‌మేమీ కాదు. కాక‌పోతే...ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటే పీరియ‌డ్ సినిమాలాంటిదే. 1980, 90ల నాటి ప‌రిస్థితుల‌ను రిక్రియేట్ చేయాలంటే భారీ సెట్స్ వేయాలి, కొంత గ్రాఫిక‌ల్ వ‌ర్క్ కూడా ఉంటుంది. మ‌రి మూడు నెల‌ల్లో ఇదంతా పూర్తి చేయ‌డం సాధ్య‌మేనా?

ద‌స‌రా సంద‌ర్భంగా సినిమాని తిరుప‌తిలో లాంచ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన వ‌ర్మ ఆ త‌ర్వాత మ‌ళ్లీ దాని గురించి ఊసెత్త‌డం లేదు. ఇంత‌కీ ఎన్టీఆర్‌గా న‌టించేది ఎవ‌రు? ల‌క్ష్మీపార్వతి ఎవ‌రు? చ‌ంద్ర‌బాబు నాయుడు పాత్ర‌కి ఎవ‌ర్నీ తీసుకుంటున్నాడు. "లక్ష్మీస్ ఎన్టీఆర్" చిత్రాన్ని జ‌న‌వ‌రి 24న విడుద‌ల చేస్తానంటున్నాడు వ‌ర్మ‌. ఎందుకంటే అదే రోజు క్రిష్ తీస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండో భాగం రిలీజ్ కానుంది. దానికి పోటీగా దీన్ని రిలీజ్ చేయ‌నున్నాడు.