లాజిక్‌, మేజిక్‌..రెండూ కావాలి!

Why Tollywood directors are makng nonsensical movies?
Monday, January 14, 2019 - 17:00

ఎదిగిపోతున్నామని కంగారుపడొద్దు... అక్కడే ఉన్నాం...

"కేరాఫ్ కంచరపాలెం" చూశాకా అరే.. భలే తీశాడే... తక్కువ బడ్జెట్ లో, అంతా కొత్తవాళ్లతో నిజంగా కొత్తగా తీశారు అని సగటు ప్రేక్షకుడు సంబరపడిపోయాడు.

నీదీ నాదీ ఒకే కథను తెర మీద చూసి కొత్త దర్శకుడు మంచి ప్రయత్నం చేస్తున్నారు అనుకొన్నారు.

బాలీవుడ్ లో మాత్రమే చూస్తున్నాం బోల్డ్ మూవీస్ ఇక్కడివాళ్లు తీయారు అనే ఒకరకమైన అసంతృప్తిని "ఆర్ ఎక్స్ 100" వంటివి దూరం చేశాయి.

ఇమేజ్ ఛత్రంలోంచి స్టార్స్ బయటకు రారు అనుకొంటే రాంచరణ్ "రంగస్థలం" చేసి మెప్పించాడు. "మహానటి" బయోపిక్ వచ్చాక పెద్ద సంస్థలు కూడా రిస్క్ చేస్తున్నాయి అనుకొంటూ తెలుగు సినిమా ఎదిగిపోతోంది... మనం కూడా నవ్యరీతి సినిమాలతో తల ఎగరేసి నిలబడవచ్చు అని ప్రేక్షకులు ఆనందపడ్డారు.

 ప్రేక్షక దేవుళ్ళారా... ఎదిగిపోతున్నామని కంగారుగా ఆనందపడిపోవద్దు. మనమేమీ ఎదగలేదు ఇంకా 80ల్లోనే ఉన్నామని బోయపాటి శ్రీను, వినాయక్, శ్రీను వైట్ల లాంటి ‘సమర్థ అధోగమన రథ సారధులు’ బలంగా చెబుతున్నారు. లాజిక్ ఎవడికి కావాలి మేం తీసిందే సినిమా... హీరోని ఎలివేట్ చేసేటప్పుడు మ్యాజిక్ ఉంటే చాలు అనుకొనే దర్శకశ్రేష్టులు టాలీవుడ్ లో ఇప్పటికీ తామే మ..మ..మాస్ డైరెక్టర్స్, తమను మించినవాళ్లు లేరు అనుకొంటూ తెలుగు సినిమాను సమర్థంగా పాతాళం వైపు ప్రయాణింపచేస్తున్నారు.

సంక్రాంతి కోడి పుంజులా బరిలోకి దిగిన ‘వినయ విధేయ రామ’ చూసిన తరవాత సగటు ప్రేక్షకుడి ఫ్యూజులు ఎగిరిపోయాయ‌ని ఫీలైతే ఆ తప్పు ఎవరిది? అసలు మనం ఏం చేసినా చూస్తారు అనుకొనే స్టార్ హీరోదా? మనం తీసిందే సినిమా అనుకొనే దర్శకుడిదా? ఇద్దరిదీ కాదు అలాంటి సినిమా తీసిన నిర్మాతదా?

అయినా ఇప్పుడు అలాంటి విషయాలు చూసుకొనే సత్తా ఉన్న నిర్మాతలు ఎక్కడ ఉన్నారు... అంతా కాంబినేషన్ సెట్ చేసి అమ్ముకోనేవాళ్లే తప్ప.

ఇక దర్శకుడి మీద గుడ్డి నమ్మకంతో, అతను ఏమి చెబితే అది చేసుకువెళ్లిపోవడం కూడా పొరపాటే ఇలాంటి సినిమాలు చూస్తే అనిపించకమానదు. అతను చెప్పే సీన్లలో లాజిక్ లేకుండా, చెత్తగా ఉంటే హీరో కలుగచేసుకొని ఉంటే ఇంతటి దారుణమైన సినిమా వచ్చేది కాదు. నేపాల్ బోర్డర్ వరకూ ట్రైన్ మీద నిలబడి వెళ్ళే సీన్ మీద వచ్చిన ట్రోల్స్, ప్రేక్షకుల తిట్లు తప్పేవి. ఇక దర్శకుడుని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు... ఇక్కడ కెప్టెన్ బోయపాటి తప్పిదాలే ఎక్కువగా ఉన్నాయి అంటే నిజం కాదు అని ఎవరూ అనలేని పరిస్థితి. హీరో ఇమేజ్ ని రెండింతలు చేసే దర్శకుడిగా తనకున్న పేరు ప్రకారమే తాను ఎలాంటి యాక్షన్ సీన్లు తీసినా చూస్తాను అనే భ్రమలేబోయపాటి శ్రీను ఈ సినిమా చుట్టి జనం మీదకు వదిలితే ఎలా? మాస్ దర్శకులు రిలాక్స్ మోడ్ లో ఉండి, ఇప్పటి ప్రేక్షకుల అభిరుచులు, వాళ్ళు ఎంత అప్ డేట్ అయి ఉన్నారో తెలుసుకోకుండా సినిమాలు తీస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది.

తన కథను చిరంజీవి ముందే జడ్జ్ చేశారని బోయపాటి చెప్పుకొన్నారు. అసలు ఆయనకు చెప్పిన కథ, తీసిందీ ఒకటేనా? ఒకవేళ చెప్పిందే తెస్తే చిరు జడ్జిమెంట్ ఇంత ఘోరమా అనిపిస్తుంది. స్క్రిప్ట్ పై దృష్టిపెట్టి ఉంటే ‘బోయపాటి వేటుకు గాయపడిన కొణిదెలా..’ లాంటి సైటర్ల నుంచి బయటపడేవాడు.

వినాయక్ "ఇంటెలిజెంట్", శ్రీను వైట్ల "అమర్ అక్బర్ ఆంథోనీ" లాంటివి చూశాకా  సినిమా కథ, కథనాలను అనేవి ఉంటాయి అనే విషయాన్ని ఇలాంటి దర్శకులు మర్చిపోయి పని చేస్తున్నారా అనిపిస్తుంది. లాజిక్ ఎందుకు మ్యాజిక్ ఉంటే చాలు అనుకొంటే ప్రేక్షకులు సరిపెట్టుకొనే రోజులు కావివి. ఈ వాస్తవాన్ని కథ సిద్దం చేసుకొనే దశ నుంచి బొమ్మ వెండి తెరపై పడే వరకూ గుర్తు ఉంచుకొంటే దర్శకులకే మంచిది. వీళ్ళు తెలుగు సినిమా స్థాయి పెంచక్కర్లేదు... తగ్గించకుండా ఉంచితే అదే పది వేలు.

Written by Swathi