కియ‌రా శివ‌తో సై అంటుందా?

Will Kiara agree to pair up with Siva Karthikeyan
Wednesday, June 5, 2019 - 15:45

కియ‌రా అద్వానీ ఇప్ప‌టికే తెలుగులో రెండు పెద్ద సినిమాల్లో న‌టించింది. "భ‌ర‌త్ అనే నేను" సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యింది కానీ రెండో చిత్రం "విన‌య విధేయ రామ" దారుణ ప‌రాజ‌యం పాలైంది. దాంతో ఆమె మ‌రో తెలుగు సినిమా ఇంకా సైన్ చేయ‌లేదు. దానికి తోడు ఆమెకి బాలీవుడ్‌లో బోలెడ‌న్నీ ఆఫ‌ర్లున్నాయి. చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.

ఐతే ఈ అందాల భామ అందానికి త‌మిళ మేక‌ర్స్ కూడా ఫిదా అయ్యారు. ఆమెని త‌మిళంలో అరంగేట్రం చేయించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే శివ కార్తీకేయ‌న్ స‌ర‌స‌న న‌టించ‌మ‌ని ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఆఫ‌ర్ ఇచ్చింద‌ట‌. మ‌రి కియారా శివ కార్తీకేయ‌న్ సినిమా సైన్ చేస్తుందా అనేది చూడాలి.

కియ‌రా ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో బాయ్‌ఫ్రెండ్ సిద్దార్థ్ మ‌ల్హోత్రాతో ఒక మూవీ చేస్తోంది. అలాగే క‌ర‌ణ్ జోహ‌ర్ డైర‌క్ష‌న్లోనూ మూవీ ఒప్పుకొంది. ఇక అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్ "క‌బీర్ సింగ్" రిలీజ్‌కి రెడీగా ఉంది.