కరోనా వల్ల పారితోషికాలు తగ్గుతాయా?

Will remunerations go down after corona?
Friday, April 24, 2020 - 22:00

టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఇది. ఎవర్ని కదిలించినా ఇదే చర్చ. టాలీవుడ్ స్వరూపం మారిపోతోందని, హీరోలు ఒకప్పట్లా కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే పరిస్థితి ఉండదని, అంతా పారితోషికాలు తగ్గించుకోవాలని అంటున్నారు. మరి దీనిపై సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఏమంటున్నారు?

"రెమ్యూనరేషన్ తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తే కచ్చితంగా తగ్గించుకుంటాం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఎవ్వరూ భారీ వేతనాలు తీసుకోవడం లేదు. ఎవరు ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటున్నారు. పరిస్థితులు మారిన సందర్భంలో ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటారు."

కష్టాలు కళ్లముందు కనిపిస్తున్నప్పుడు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే నటులు ఎవ్వరూ లేరంటున్నారు ప్రకాష్ రాజ్. అదే టైమ్ లో ఓ హీరో భారీ పారితోషికం తీసుకుంటున్నాడనే కుళ్లు పనికిరాదన్నారు. ప్రతి విషయానికి కాలమే సమాధానం చెబుతుందంటున్నారు.

"భారీ వేతనాలు ఊరికే ఇవ్వరు. ఎవరికి ఎంత అర్హత ఉంటుందో అంత తీసుకుంటారు. ఎదిగిన వాడ్ని చూసినప్పుడు అలా అనుకుంటారు కొంతమంది. కానీ అది తప్పు. అది వాడు కష్టపడి సంపాదించుకున్న అర్హత. అలాంటి వాళ్లు పరిస్థితులు మారినప్పుడు దానికి తగ్గట్టుగా ఏం చేయాలో చేస్తారు."

తన వరకు తాను పరిస్థితులకు తగ్గట్టు రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి సిద్ధమని ప్రకటించారు ప్రకాష్ రాజ్.