సిద్దార్థ్ రీఎంట్రీ మూవీ ఇదేనా?

Will Siddharth sign Maha Samudram?
Tuesday, April 28, 2020 - 23:00

సిద్దార్థ్ తెలుగులో చేసిన చిట్టచివరి స్ట్రయిట్ మూవీ చెప్పమంటే ఠక్కున చెప్పడం కష్టం. ఎందుకంటే అతడు నేరుగా తెలుగులో సినిమా చేసి చాన్నాళ్లయింది కాబట్టి. అలా చాన్నాళ్లుగా తెలుగుతెరకు దూరమైన ఈ హీరో, ఇన్నాళ్లకు ఓ స్ట్రయిట్ తెలుగు మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది కూడా ఓ మల్టీస్టారర్ కావడం విశేషం.

అవును.. అజయ్ భూపతి దర్శకత్వంలో రాబోతున్న మహాసముద్రం సినిమాలో హీరోగా సిద్దార్థ్ నటించే అవకాశం ఉంది. చర్చలైతే పూర్తయ్యాయి. లాక్ డౌన్ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఆర్ఎక్స్-100 లాంటి సూపర్ హిట్ తర్వాత పూర్తిగా మహాసముద్రం ప్రాజెక్టుకే పరిమితం అయిపోయాడు దర్శకుడు అజయ్. ఎంతోమందికి ఈ కథ వినిపించాడు. రవితేజ, నాగచైతన్య లాంటి హీరోలతో సినిమా దాదాపు లాక్ అయి కాన్సిల్ అయిపోయింది.

ఈ నేపథ్యంలో.. మహాసముద్రంలో ఒక హీరోగా నటించేందుకు ముందుకొచ్చాడు శర్వానంద్. మరో పాత్ర పోషించేందుకు ఏ తెలుగు హీరో ముందుకురాకపోవడంతో సిద్దార్థ్ కు ఈ కథ వినిపించాడట దర్శకుడు. శర్వానంద్-సిద్దార్థ్ కాంబినేషన్ తెరపై చూడ్డానికి బాగానే ఉంటుంది. మరి సిద్ధూ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.