లవర్ వల్ల 22 కోట్లు నష్టం

World Famous Lover final collections
Wednesday, March 18, 2020 - 18:00

"వరల్డ్ ఫేమస్ లవర్" వచ్చాడు. బయ్యర్లను నిలువునా ముంచాడు. విడుదలైన మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, రోజులు గడిచేకొద్ది అట్టర్ ఫ్లాప్ గా, క్లోజింగ్ కు వచ్చేసరికి డిజాస్టర్ గా నిలిచింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే క్రేజ్ వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇదే. తాజాగా ఈ సినిమా ఫైనల్ కలెక్షన్లు విడుదలయ్యాయి.

ఇక లెక్కల విషయానికొద్దాం. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల రూపాయలకు (కోటి రూపాయల అడ్వాన్స్ లు కలపడం లేదు) అమ్మారు. ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి ఈ సినిమాకు కేవలం 8 కోట్ల 13 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఎక్కడా ఆడటం లేదు. కరోనా వల్ల ఆడే ప్రసక్తే లేదనుకోండి, అది వేరే విషయం. అలా ఫైనల్ రన్ ముగిసేసరికి బయ్యర్లు నిండా మునిగిపోయారు.

ఈ సినిమాకు ముందు వరకు దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ నోటా మాత్రమే. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఆ సినిమా, భారీ రేట్లకు అమ్ముడుపోయి అంతే భారీగా ఫ్లాప్ అయింది. ఇప్పుడా ఫ్లాప్ మూవీని వరల్డ్ ఫేమస్ లవర్ అధిగమించాడు. అటు ఓవర్సీస్ లోనైతే ఈ సినిమా కోటి రూపాయలు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మించిన సినిమా ఇది