క్రేజ్ కావాలంటే జగన్ రావాలి!

YS Jagan needs to come onboard for Yatra?
Wednesday, November 21, 2018 - 15:45

ఒక‌వైపు ఎన్టీఆర్ బ‌యోపిక్ నిత్యం వార్త‌ల్లో నిలుస్తుండ‌గా, మ‌రోవైపు వైఎస్సార్ బ‌యోపిక్ గురించి అస్స‌లు చ‌ర్చే జ‌ర‌గ‌డం లేదు. ఈ సినిమాకి క్రేజ్ రావ‌డం లేదు. మహి రాఘవ్ డైరక్ట్ చేస్తున్న "యాత్ర"  సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌యింది.
వైఎస్ఆర్ గా మలయాళ లెజెండ్‌ మమ్ముట్టి నటిస్తున్నాడు. కానీ బజ్ రావడం లేదు, మార్కెట్ పెరగడం లేదు.

ప్రీ-రిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. మరోవైపు శాటిలైట్ డీల్ క్లోజ్ చేద్దామంటే అక్కడ కూడా ఆశించిన రేంజ్ లో కొటేషన్స్ రావడం లేదట‌. దీంతో మేకర్స్ రిపేర్లు మొదలుపెట్టారు. యాత్రలో జగన్ పాత్రను చొప్పించాలని ఫిక్స్ అయ్యారనేది తాజా స‌మాచారం.

యాత్ర సినిమాలో ముందు అనుకున్న స్క్రీన్ ప్లే ప్రకారం జగన్ పాత్ర ఉంది. మొదట హీరో సూర్య కోసం ప్రయత్నించారు. కుదరలేదు. తర్వాత విజయ్ దేవరకొండ కోసం ట్రై చేశారు. వర్కవుట్ కాలేదు. దీంతో జగన్ పాత్ర లేకుండానే, స్క్రీన్ ప్లేలో మార్పుచేర్పులు చేసి యాత్ర సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు.

కట్ చేస్తే, ఇప్పుడు సినిమాకు బిజినెస్ జరగని నేపథ్యంలో జగన్ పాత్రను తిరిగి చొప్పించాలని మేకర్స్ తాజాగా నిర్ణయించారు. జగన్ ఎంట్రీతో యాత్రకు బజ్ పెరగడం ఖాయం. అయితే ఇక్కడ 2 సమస్యలున్నాయి. ఒకటి జగన్ పాత్రధారి ఎవరనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు.

ఒకవేళ జగన్ పాత్రధారి దొరికితే అతడితో సకాలంలో షూటింగ్ పూర్తిచేసి సినిమాను విడుదల చేయడం మరో సమస్య. ఈ రెండు సమస్యల్ని యాత్ర యూనిట్ ఎలా అధిగమిస్తుందో చూడాలి. బిజినెస్ పూర్తయితే తప్ప యాత్ర సినిమా డిసెంబర్ 21న వస్తుందా లేక సంక్రాంతికి వస్తుందా అనే విషయంపై క్లారిటీ రాదు. ఆ క్లారిటీ కావాలంటే జగన్ రావాలి.