జైరాపై మండిప‌డ్డ సోష‌ల్ మీడియా

Zaira Wasim bids bye, gets mixed reactions
Monday, July 1, 2019 - 14:45

"దంగ‌ల్‌", "సీక్రెట్ సూప‌ర్‌స్టార్" సినిమాల‌తో పాపుల‌ర్ అయిన జైరా వ‌సీమ్ ఇపుడు సినిమా రంగానికి దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించింది. దానికి ఆమె చెప్పిన కార‌ణ‌మే ఇపుడు దుమారం రేపుతోంది. త‌న ఇస్లాం మ‌త విశ్వాసాల‌కి విరుద్ద‌మైన పంథాలో సాగే ఈ సినిమా ఇండ‌స్ర్టీతో ప్ర‌యాణం సాగించ‌డం ఇష్టం లేక ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ట‌.

ఐతే ఆమె నిర్ణ‌యాన్ని కొంత‌మంది స్వాగ‌తించినా.. ఎక్కువ శాతం విమ‌ర్శిస్తున్నారు. మ‌తం పేరు చెప్పి తిరోగ‌మ‌న పంథాలో వెళ్లే ఇలాంటి అమ్మాయిల‌కి మాన‌సిక ప‌రిణితి సాధించేలా చేయాల‌ని కొంద‌రు కోరుతున్నారు. రెండు సినిమాల్లో న‌టించిన త‌ర్వాత ఈ సినిమా ఇండ‌స్ట్రీపై గౌర‌వం పోయిందా అని ర‌వీనాటాండ‌న్‌లాంటి వారు విరుచుకు ప‌డుతున్నారు.

మిగ‌తా భామ‌ల‌తో పోల్చితే జైరా చాలా ల‌క్కీ. ఆమె టీనేజ్‌లో ఉండ‌గానే అమీర్‌ఖాన్ నిర్మాణ సంస్థ దంగ‌ల్‌లో తీసుకొంది. అందులో అమీర్‌కి కూతురిగా న‌టించింది. ఆ త‌ర్వాత అమీర్‌ఖాన్ సంస్థే సీక్రెట్ సూప‌ర్‌స్టార్ అనే సినిమా నిర్మించింది. ఈ రెండు సినిమాల‌తో అమీర్‌ఖాన్ ఆమెకి ఎంతో స్టార్‌డ‌మ్ తెచ్చాడు. అమీర్ కూడా ముస్లిమే. మ‌రి ఆయ‌న‌కి లేని బాధ జైరాకి ఎందుకు అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. అమీర్‌ఖాన్‌లాంటి గొప్ప నిర్మాత దొర‌క‌డం వ‌ల్ల ఆమెకి ఎటువంటి క‌ష్టం లేకుండా రెండు సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చాయి. ఎంతో క‌ష్ట‌ప‌డినా.. ఎంద‌రో అమ్మాయిల‌కి, అబ్బాయిల‌కి చిన్న పాత్ర‌లు కూడా ద‌క్క‌డం లేదు. అందులో ఇస్లాం మ‌తానికి చెందిన‌వారు ఎంతో మంది. అందుకే జైరా నిర్ణ‌యానికి, ఆమె చెప్పిన రీజ‌న్‌కి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.